ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పుట్టిన నాటి నుంచి తల్లి పాలు ఇవ్వడం బిడ్డ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని, చనుబాలకు మించిన ఔషధం మరొకటి లేదనే విషయాన్ని ప్రజలకు తెలిసేలా వారోత్సవాలు నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహించనున్న తల్లిపాల వారోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పుట్టిన నాటి నుంచే బిడ్డకు తల్లి చనుబాలును తప్పక అందించాలన్నారు.
తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానమని, రోగనిరోధక శక్తి అధికంగా ఉండే తల్లి పాలు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమన్నారు. తల్లిపాలపై అవగాహన కల్పించేందుకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. పాలు ఇవ్వడం వల్ల మహిళలలో సౌందర్యం తగ్గుతుందనే అపోహను తొలగించాలన్నారు. తల్లిపాలలో ఉండే పోషకాలు తల్లి బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ డీఆర్‌ఓ ఎం.లక్ష్మి నరసింహం, జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి ఎస్‌కే రుక్సానా, డీఎం అండ్‌హెచ్‌ఓ డాక్టర్ ఎం.సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి రూ.2లక్షల విరాళం
జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని పాలేటి తీరాన వేంచేసియున్న శివపంచాయతన క్షేత్రం మఠం శివాలయం పునర్ నిర్మాణానికి (సంపూర్ణ కృష్ణ శిలలతో) భక్తులు ఉదారంగా విరాళాలు ఇస్తున్నారు. సోమవారం భక్తులు జవ్వాజి ఆదిలక్ష్మి(బ్రహ్మానందం), వారి కుటుంబ సభ్యులు సంయుక్తంగా రూ. 2.116లక్షల విరాళాన్ని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు.
కారు ఢీకొనడంతో క్వారీ కార్మికుడు మృతి
కంచికచర్ల: పొట్టకూటి కోసం రాతి క్వారీలో పనిచేసేందుకు వచ్చిన ఓ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ పి. విశ్వనాథ్ కథనం ప్రకారం.. విశాఖపట్నం జిల్లా అలమంద కోడూరు మండలం పొడుగుపాడు గ్రామానికి చెందిన గొర్లి సన్నిబాబు(45) రాతి క్వారీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. దొనబండ సమీపంలో రోడ్డు దాటుతుండగా ఓ కారు వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సన్నిబాబు మృతదేహాన్ని శవ పంచనామ కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

తల్లిపాల విశిష్టతను చాటి చెప్పండి