
సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన పనులను పూర్తి చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో వివిధ మౌలిక సదుపాయాల కల్పన కోసం సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సీఎస్‌ఆర్ నిధుల వినియోగంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో నీటి నిల్వ నిర్మాణాలు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాల కోసం రూ. 8.59 కోట్ల వ్యయంతో 53 పనులు మంజూరు చేయగా అందులో 35 పనులు పూర్తయ్యాయని, మరో 14 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఏపీ ఈడబ్ల్యూఐడీసీ ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.8.8కోట్లతో 21 పనులు మంజూరు చేయగా వీటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పంచాయతీరాజ్‌శాఖ ద్వారా రూ.3కోట్ల వ్యయంతో ఏడు పనులు మంజూరు చేయగా ఇందులో ఇప్పటి వరకు మూడు పనులు మాత్రమే పూర్తయ్యాయని మిగిలినవి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సీపీవో భీమరాజు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రమణారావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ నటరాజ్, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రాయన్న పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ