
కృష్ణమ్మ ఉప్పొంగినా.. ఎండుతున్న రైతు గుండె
వృథాగా సాగరంలోకి..
అవనిగడ్డ: కృష్ణాజిల్లాలో ఈ ఖరీఫ్‌లో 1.62 లక్షల హెక్టార్లలో వరిసాగు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 92వేల హెక్టార్లలో వరినాట్లు పూర్తి అయినట్టు అధికారులు చెబుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ మండలాల్లో చాలాచోట్ల సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోడూరు మండలం పిట్టల్లంక, సాలెంపాలెం, నారేపాలెం, వేణుగోపాలపురం, నాగాయలంక మండలంలో బర్రంకుల, నాలి, గణపేశ్వరం, పర్రచివర, సొర్లగొంది. దీనదయాల్‌పురం, దిండి, గుల్లలమోద, ఏటిమొగలో నారుమళ్లకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటకాలువకు సరఫరా అవుతున్న అరకొర నీటిని గుల్లపంపు, ఆయిల్ ఇంజిన్ల ద్వారా నారుమళ్లను తడుపుకుంటున్నారు. మండే ఎండల వల్ల ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఆకుమడికి నీరు తోడాల్సి వస్తోందని రైతులు చెప్పారు. నారుమడి దగ్గర నుంచి దమ్ము చేసే వరకూ ఆయిల్ ఇంజిన్‌కు ఎకరాకు రూ.5వేల వరకూ ఖర్చులు అవుతున్నాయని కొంతమంది రైతులు తెలిపారు.
ఎండిపోతున్న వరిదుబ్బులు..
కృత్తివెన్ను మండలం చినపాండ్రాక, నీలిమూడి, మునిపెడ, యండపల్లి, చెరుకుమిల్లి గ్రామాల్లో రైతులు తీవ్ర స్థాయిలో సాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. నీలిపూడి, మునిపెడ, చినపాండ్రాకలో సాగునీరందక పలుచోట్ల నాట్లు వేయలేదు. నారుమళ్లు ముదిరిపోతున్నాయని, ఇంకో వారం పదిరోజులు సాగునీరందకపోతే నాట్లు వేసేందుకు నారు పనికిరాదని కొంత మంది రైతులు చెప్పారు. మచిలీపట్నం మండలంలోని తాళ్లపాలెం, కానూరు, పెదపట్నం, గోకవరం, మంగినపూడి, మొవ్వ మండలంలోని వేములమడ, కొండ వరంలో సాగునీరు అందక వరిదుబ్బులు ఎండిపోతున్నాయి.
కృష్ణాజిల్లాలో చాలా ప్రాంతాలకు అందని సాగునీరు బంటుమిల్లిలో నీటి కోసం రైతుల ఆందోళన దివిసీమలో గుల్లపంపు, ఇంజిన్లతో నారుమళ్లకు నీటి తడులు కృత్తివెన్ను మండలంలో పలుచోట్ల ఎండుతున్న వరి మూడు రోజుల్లో ప్రకాశం బ్యారేజీ నుంచి 3.18లక్షల క్యూసెక్కులు సముద్రం పాలు కాలువలకు నీరివ్వకుండా సముద్రంలోకి వదలడంపై రైతుల ఆందోళన
పంటకాలువలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించలేని అధికారులు, కృష్ణా నది నీటిని వృథాగా సముద్రంలోకి వదలడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల పంటకాలువలకు పూర్తిస్థాయిలో పూడిక తీత పనులు చేయలేదు. దీంతో 20 నుంచి 30 శాతం తక్కువ సాగునీరు సరఫరా అవుతోందని రైతులు చెప్పారు. ప్రకాశం బ్యారేజీ నుంచి మూడు రోజులుగా 3.10లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదిలారు. ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో పంటకాలువలకు సాగునీరు వదిలేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

కృష్ణమ్మ ఉప్పొంగినా.. ఎండుతున్న రైతు గుండె