
ఉపాధ్యాయుల సమస్యలపై ఫ్యాప్టో ధర్నా
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయులను బోధనేతర పనులకు దూరంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) కృష్ణా జిల్లాశాఖ ఆధ్వర్యంలో శనివారం మచిలీపట్నంలోని ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమం చేపట్టింది. జిల్లా ఫ్యాప్టో చైర్మన్ అంబటిపూడి సుబ్ర మణ్యం, జనరల్ సెక్రటరీ కె.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు పెంచాలని చెబుతున్న ప్రభుత్వం జూలైలో పాఠశాలల్లో చేరిన పిల్లలకు నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు ఇప్పటివరకు అందించలేదన్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేయకుండా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సాయంత్రం 4 నుంచి 5 వరకు విద్యాశక్తి కార్యక్రమం నిర్వహించాలని ఉపాధ్యాయులను వత్తిడి చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ బోధనకు సంబంధం లేని పనుల్లో ఉపాధ్యాయులను నియమించడం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను దెబ్బతీస్తుందన్నారు. మొత్తం 18 డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్, హెచ్‌ఎంఏ జిల్లా కార్యదర్శి కె.విజయ, జిల్లా కో చైర్మన్ ఎం. రాజేష్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.కనకారావు, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర కార్యదర్శి బి.నాగరాజు, ఏపీటీఎఫ్ 257 రాష్ట్ర నాయకురాలు కె.నాగసోమేశ్వ రమ్మ, డెప్యూటీ సెక్రటరీ జనరల్ డి.అశోక్ కుమార్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.ఇమాన్యూల్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు గంగాధరరావు, ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్షులు శేషగిరి, శివరామకృష్ణ, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సాల్మన్ రాజు ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు.
18 డిమాండ్లతో ప్రభుత్వానికి విజ్ఞప్తి
బోధనేతర పనుల నుంచి దూరం పెట్టాలని ప్రధాన డిమాండ్
పలు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు