
11 మంది చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): అత్యంత క్లిష్టతరమైన గుండె సమస్యలున్న 11 మంది చిన్నారులకు విజయవాడలోని ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఆంధ్రా హాస్పిటల్స్, హీలింగ్ లిటిల్‌హార్ట్స్, యూకే చారిటీ సౌజన్యంతో ఈ శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు ఆస్పత్రి పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు చెప్పారు. విజయవాడ సూర్యారావుపేటలోని ఆస్పత్రిలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 28 నుంచి ఈ నెల 2 వరకూ నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో బెంగళూరుకు చెందిన పిడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ బీఆర్ జగన్నాధ్, ఆంధ్రా హాస్పిటల్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ నాగేశ్వరరావుతో కలిసి ఈ శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. పదేళ్లుగా తమ ఆస్పత్రిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఉచిత గుండె శస్త్ర చికిత్సలు చేస్తున్నామని, అందులో భాగంగా ప్రస్తుతం 35వ ఉచిత పిల్లల గుండె సర్జరీల క్యాంపు నిర్వహించి 11 మందికి సర్జరీలు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకూ తమ ఆస్పత్రిలో 4800 వరకు సర్జరీలు ఇంటర్వెన్షన్స్ చేశామన్నారు. ఆంధ్రా హాస్పిటల్ పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ ఆధ్వర్యంలో పిడియాట్రిక్ కార్డియాలజీ టీమ్ ఈ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో సీటీ సర్జన్లు డాక్టర్ బీఆర్ జగన్నాధ్, డాక్టర్ నాగేశ్వరరావు, పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్, కార్డియాక్ ఎనస్థిస్ట్ డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్‌లో నిర్వహణ