
పర్యావరణ పరిరక్షణకు చర్యలు
కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): మొక్కలు విరివిగా నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్ లో సోమవారం సాయంత్రం ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వివిధ శాఖల అధికారులతో మొక్కల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భావితరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విరివిగా మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, వ్యక్తిగత గృహాలకు మొక్కలను ఉచితంగా పంపిణీ చేసేందుకు మచిలీపట్నం నగరంలో చిన్నాపురం డాక్టర్ గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ లక్ష్మణస్వామి ముందుకు వచ్చారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణస్వామిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. రానున్న జూలై నాటికి మొక్కలు నాటే ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఆ లోపుగా మొక్కల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్, కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉష, జిల్లా అటవీ శాఖ అధికారి సునీత, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి.రమేష్, దేవదాయ, సాంఘిక సంక్షేమ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని వృద్ధురాలు మృతి
మోపిదేవి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు కృష్ణా జిల్లా మోపిదేవిలో 216 జాతీయ రహదారిపై ఎస్.విహార్ సమీపంలో ఆదివారం రోడ్డు దాటుతుండగా సుమారు 65 సంవత్సరాల వయస్సు గల వృద్ధ మహిళను ద్విచక్ర వాహనం ఢీకొన్నట్లు తెలిపారు. గాయపడిన వృద్ధురాలు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు వివరించారు. మృతి చెందిన వృద్ధురాలిని గుర్తుపట్టిన వారు సమాచారం పోలీస్ స్టేషన్‌లో ఇవ్వవలసిందిగా ఎస్‌ఐ సత్యనారాయణ కోరారు.