కూటమిలో పెత్తందార్లకే చోటు | Sakshi
Sakshi News home page

కూటమిలో పెత్తందార్లకే చోటు

Published Mon, Apr 8 2024 1:50 AM

- - Sakshi

విజయవాడ, సమీప ఆరు నియోజకవర్గాలూ ఓసీలకే..

బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలను పక్కన పెట్టిన కూటమి

టీడీపీ అధినేత సామాజికవర్గానికి చెందిన వారికే పెద్దపీట

కూటమి తీరుపై భగ్గుమంటున్న బీసీలు, ఆర్యవైశ్యులు, మైనార్టీలు

టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయాన్ని పాటించిన వైఎస్సార్‌ సీపీ

సాక్షి, ప్రతినిధి, విజయవాడ: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయానికి పాతరేసింది. విజయవాడ నగరంలో ఈస్ట్‌, వెస్ట్‌, సెంట్రల్‌, సమీప పరిసరాల్లో మైలవరం, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గ టికెట్ల కేటాయింపును పరిశీలిస్తే పొత్తులో భాగంగా టీడీపీ ఐదు నియోజక వర్గాల్లో, బీజేపీ ఒక చోట పోటీ చేస్తున్నాయి. ఈ స్థానాలన్నింటికీ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో టీడీపీ అభ్యర్థులు ప్రకటించిన ఐదు స్థానాల్లో ఆ పార్టీ అధినేత సామాజిక వర్గానికి చెందినవారు నలుగురు, కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఒకరు ఉన్నారు.

బీజేపీ ప్రకటించిన అభ్యర్థి కూడా టీడీపీ అధినేత సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే కూటమి పూర్తిగా సామాజిక న్యాయాన్ని విస్మరించిందని తెలుస్తోది. బీసీ, మైనార్టీ , ఇతర వర్గాలను పక్కన పెట్టేసింది. కేవలం వీరిని పార్టీ జెండా మోసే కూలీలుగా చూస్తోందని చెప్పొచ్చు. ఎన్నికల సమయంలో పావులుగా వాడుకొని, ఓట్లు కొల్లగొట్టేందుకు మాయమాటలు చెప్పడం తప్ప, ఆ వర్గాలకు టికెట్ల కేటాయింపులో న్యాయం చేయలేదని విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు.

కూటమిలో పెత్తందార్లకే చోటు
కూటమి ప్రకటించిన అభ్యర్థుల్లో విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహనరావు, పెనమలూరులో బోడె ప్రసాద్‌, గన్నవరంలో యార్లగడ్డ వెంకటరావు, మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్‌, విజయవాడ వెస్ట్‌లో సుజనా చౌదరి .. ఈ ఐదుగురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. విజయవాడ సెంట్రల్‌లో బొండా ఉమా కాపు సామాజిక సామాజిక వర్గం. ఇలా ఆరు మంది ఓసీ సామాజిక వర్గం వారే కావడం విశేషం. బీసీ, మైనార్టీ, ఆర్యవైశ్య వర్గాలకు మొండి చెయ్యి చూపారు. అక్కడ టీడీపీ అధినేత సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్దపీట వేశారు. ఈ ఆరు నియోజక వర్గాల్లో కమ్మ, కాపు సామాజిక వర్గాలే కాకుండా బీసీలు, మైనార్టీలు ఇతర వర్గాల వారు ఉన్నారు. ఈ టికెట్ల కేటాయింపులోనే టీడీపీ అసలు రంగు బయట పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

విజయవాడ పశ్చిమలో మైనార్టీలు ఎక్కువగా ఉంటారు. చంద్రబాబు మైనార్టీలకు సీటు కేటాయిస్తామని చెప్పి, పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించి , టీడీపీ తానుముక్క , తమ సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరికే టికెట్‌ ఇచ్చేలా చక్రం తిప్పారు. ఈ ఆరు నియోజక వర్గాల్లో జనసేనకు ఒక్క టికెట్‌ కూడా ఇవ్వలేదు. విజయవాడ పశ్చిమ సీటు తొలుత పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. ఇక్కడ పదేళ్లుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన పోతిన మహేష్‌ పార్టీ జెండా మోయడంతో పాటు, జనసేన పార్టీ కార్యక్రమాలకు డబ్బులను ఖర్చు చేశారు.

అయితే టికెట్‌ మీకే కేటాయిస్తున్నామని పవన్‌ మొదట పోతిన మహేష్‌కు చెప్పడంతో, ఆయన నియోజక వర్గంలో ఇంటింటి ప్రచారం చేశారు. తీరా డబ్బు మూటలు అందగానే పొత్తులో భాగంగా టికెట్‌ను బీజేపీకి కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. పవన్‌.. పదేళ్లు ఓ బీసీ అభ్యర్థిని వాడుకొని టికెట్‌ ఇవ్వకుండా మోసం చేశారు. ఇక్కడ జనసేన బీసీ వర్గాలను, టీడీపీ మైనార్టీ వర్గాలను మోసం చేసింది. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కిన కూటమి అభ్యర్థులకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధమవుతున్నారు.

సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిన వైఎస్సార్‌ సీపీ
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక న్యాయం అంటే ఏంటో టికెట్ల కేటాయింపులో చూపారు. విజయవాడ తూర్పు నియోజక వర్గం దేవినేని అవినాష్‌ (కమ్మ), సెంట్రల్‌ వెలంపల్లి శ్రీనివాస్‌ (వైశ్య), వెస్ట్‌ షేక్‌ ఆసిఫ్‌ (మైనార్టీ), పెనమలూరు జోగి రమేష్‌ (గౌడ), మైలవరం సర్నాల తిరుపతి రావు (యాదవ), గన్నవరం వల్లభనేని వంశీ (కమ్మ) ఇలా అన్ని సామాజిక వర్గాల వారికి టికెట్లు కేటాయించారు. టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం స్పష్టంగా కనిపిస్తోంది.

విజయవాడ నగరం, దానికి అనుబంధంగా ఉండే ఆరు నియోజక వర్గాలను తీసుకొని పరిశీలిస్తే వైఎస్సార్‌ సీపీ రెండు కమ్మ, రెండు బీసీ, ఓ మైనార్టీ, ఓ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారిని అభ్యర్థులుగా ప్రకటించారు. వైఎస్సార్‌ సీపీ సమతుల్యం పాటించి అన్ని వర్గాలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం కల్పించారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇందులో మైలవరం నియోజక వర్గానికి ఓ సామాన్యుడిని, డబ్బున్న పెత్తందారుపై పోటీకి అభ్యర్థిగా నిలిపారు. విజయవాడ వెస్ట్‌ నియోజక వర్గంలో సైతం మైనార్టీ వర్గానికి చెందిన సామాన్య అభ్యర్థి వైపే వైఎస్సార్‌ సీపీ మొగ్గు చూపింది.

Advertisement
Advertisement