యంత్రం.. ఛూమంత్రం
గత ప్రభుత్వంలో రైతులకు ఊతం
యంత్ర సేవా కేంద్రాలకు మంగళం
రాయితీపై వ్యవసాయ యంత్రాలపంపిణీని గాలికొదిలేసిన వైనం
యాప్‌ల ద్వారా వాటినిఅద్దెకు తీసుకోవాలని హితవు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ జిల్లాలో రూ.32.84కోట్ల విలువైన యంత్రాలు, పరికరాల పంపిణీ
మాటలు తప్ప చేతలు శూన్యం
ప్రభుత్వ చేతగాని తనమే!
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన అనేక పథకాలను ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ముఖ్యంగా వ్యవసాయంపై ఆది నుంచి చిన్నచూపు ఉన్న చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక కూడా తన పాత వైఖరినే కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు బహుళ ప్రయోజనకారిగా దోహదపడిన రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చినా పేరులోనే తప్ప సేవలు పూజ్యం అన్నట్టుగా చేశారు. ఇక యంత్ర సేవా కేంద్రాలకై తే ఏకంగా మంగళం పాడేశారు.
జి.కొండూరు: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మార్చి కుదించడం, క్రాప్ ఇన్సూరెన్స్ ను ఎత్తివేయడం, పంట నష్ట పరిహారాన్ని అందించకుండా వేధించడంతో పాటు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన యంత్ర సేవా కేంద్రాలను సైతం ఎత్తివేసి రైతులకు రాయితీపై అందించవలసిన యంత్రాలు, పరికరాల పంపిణీకి మంగళం పాడింది. రైతులు తమకు అవసరమైన యంత్రా లు, పరికరాలను అద్దెకు తీసుకోవాలంటూ రెండు యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ ఏడాది యాంత్రీకరణ లేనట్టే
వ్యవసాయ యాంత్రీకరణ కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన యంత్ర సేవా కేంద్రా లకు మంగళం పాడిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది అంటే 2024–25 వ్యవసాయ సంవత్సరంలో తూతూమంత్రంగా వ్యవసాయ పరికరాలను అందించి చేతులు దులుపుకొంది. ఎన్టీఆర్ జిల్లాలో 1,08,859 మంది రైతులు ఉంటే 867 మంది రైతులకు మాత్రమే రూ.167.27 లక్షలతో వ్యవసాయ పరికరాలను అందించారు. రూ.274.40 లక్షలతో 35 కిసాన్ డ్రోన్‌లను పంపిణీ చేశారు. ట్రాక్టర్లు, ఇతర యంత్రాలేవీ పంపిణీ చేయలేదు. పంపిణీ చేసిన పరికరాలు కూడా అధికార పార్టీ నాయకుల సిఫార్సులతో టీడీపీ సానుభూతిపరులకే అందించారని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం రాయితీపై అందించిన పరికరాల ధర, బయట మార్కెట్లో లభించే పరికరాల ధరకు వ్యత్యాసం లేదని విమర్శలు వచ్చాయి. ఇక ఈ ఏడాది అంటే 2025–26 వ్యవసాయ సంవత్సరం మార్చితో ముగిస్తున్నప్పటికీ యాంత్రీకరణ ఊసే ప్రభుత్వం ఎత్తకపోవడంతో రైతుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
అద్దెకు తీసుకునేలా యాప్‌లు
రైతులకు వ్యవసాయ పరికరాలు, యంత్రాలను రాయితీపై అందించలేని చంద్రబాబు ప్రభుత్వం వాటిని అద్దెకు తీసుకునేలా ఏపీ ఎయిమ్స్, ఊబైరెజేషన్ యాప్‌లను అంటుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ అందుబాటులోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ జిల్లాలో ఇప్పటివరకు 12వేల మంది మాత్రమే లాగిన్ అయినట్లు తెలుస్తోంది. అది కూడా యాభై శాతంకు పైగా స్మార్ట్‌ఫోన్‌లు లేని రైతులకు కీప్యాడ్ ఫోన్‌లకు ఓటీపీ పంపి లాగిన్ చేయించినట్లు సమాచారం. యాప్ నిర్వాహకులకు దోచిపెట్టే సొమ్ముతో రైతులకు రాయితీపై యంత్రాలనే అందించొచ్చని రైతులంటున్నారు.
వ్యవసాయ యాంత్రీకరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప చేతల్లో కనిపించడంలేదు. వ్యవసాయ యంత్రాలు, పరికరాలు రాయితీపై అందించలేక ఇప్పుడు అద్దెకు తీసుకోవాలంటూ యాప్‌లను తీసుకొచ్చారు.
–గుడిపూడి రమేష్,
రైతు, కోడూరు, జి.కొండూరు మండలం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ఒక్కొక్క రైతు భరోసా కేంద్రానికి ఒక యూనిట్‌గా వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరి కోత యంత్రాలకు పది శాతం రైతు వాటాతో ప్రభుత్వం అందించే 40 శాతం రాయితీతో కలుపుకొని ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా 50 శాతం రుణాలను మంజూరు చేయించింది. ఈ విధంగా ఒక్కొక్క యంత్ర సేవా కేంద్రానికి రూ.15లక్షల విలువ చేసే ట్రాక్టరు, యంత్ర పరికరాలను అందజేశారు. క్లస్టర్ యంత్ర సేవా కేంద్రంలో ఏర్పడిన రైతు గ్రూపునకు రూ.25లక్షల విలువ చేసే వరికోత యంత్రాన్ని అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 267 రైతు భరోసా కేంద్రాలకు గానూ 257 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు, 34 క్లస్టర్ లెవెల్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి రూ.32.84కోట్ల విలువగల 1667 వ్యవసాయ పరికరాలు, 35 వరికోత యంత్రాలు, 183 ట్రాక్టర్లను రైతులకు అందజేశారు. ఈ విధంగా ప్రభుత్వం నుంచి రూ.11.83కోట్ల రాయితీని రైతులు పొందారు.
పోయిన సంవత్సరం తూతూ మంత్రంగా వ్యవసాయ పరికరాలను అందించిన ప్రభుత్వం ఈ ఏడాది అది కూడా చేతకాక అద్దెకు తీసుకునేలా యాప్ తీసుకొచ్చింది. ఇది ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనం.
–మండల శేషయ్య, రైతు,
మునగపాడు, జి.కొండూరు మండలం
యంత్రం.. ఛూమంత్రం
యంత్రం.. ఛూమంత్రం


