ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణను బుధవారం కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన పరీక్ష కేంద్రంలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, నిబంధనల మేరకు జరుగుతున్నాయా లేదా అనే అంశాలను స్వయంగా పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, సరైన విధంగా హాజరు నమోదు, ఇన్విజిలేటర్ల విధుల నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్ష రాయడానికి తగిన డెస్కులు, లైటింగ్, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, ఫస్ట్ ఎయిడ్ వంటి ఏర్పాట్లు ఉన్నాయా అని పరిశీలించారు.ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందో బస్తు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ, ప్రశ్నపత్రాల రవాణా, భద్రపరచడం వంటి అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, ప్రథమ చికిత్స సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఇదే క్రమశిక్షణతో, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 98 పరీక్ష కేంద్రాల్లో 36,928 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 39,980 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 76,908 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న జిల్లా ఇంట ర్మీడియెట్ విద్యాధికారి బి.ప్రభాకరరావు తెలియజేశారు.


