సర్వం సర్వేల మయం | - | Sakshi
Sakshi News home page

సర్వం సర్వేల మయం

Feb 26 2026 9:30 AM | Updated on Feb 26 2026 9:30 AM

సర్వం సర్వేల మయం

సర్వం సర్వేల మయం

క్షేత్రస్థాయిలో సిబ్బందికి ప్రాణాంతకం

నిరంతర సర్వేలతో ఏఎన్‌ఎంలు, సచివాలయ సిబ్బంది సతమతం

పని ఒత్తిడితో మానసిక వేదనలో ఉద్యోగులు

ఉన్నతాధికారులకు విన్నవించినా నిష్ప్రయోజనం

క్షేత్రస్థాయిలో సిబ్బందికి ప్రాణాంతకం

పెడన: చంద్రబాబు ప్రభుత్వం వివిధ శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉద్యోగులపై సర్వేల భారం మోపుతోంది. ఉద్యోగులు తమ దైనందిన విధులకు తోడు ఈ సర్వేల కారణంగా అదనపు భారం మోయలేక శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం లక్ష్యాల సాధనలో భాగంగా ముంచెత్తుతున్న సర్వేల భారంతో వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతూ సతమతమవుతున్నారు. ప్రధానంగా వైద్య శాఖలో ఏఎన్‌ఎంలు, రెవెన్యూ శాఖలో వీఆర్వో లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం ఇష్టానుసారంగా భారం మోపుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన ఆరోగ్య సిబ్బంది సర్వేల పేరిట ఇంటింటికీ పరుగులు తీయాల్సివస్తోంది. దీంతో ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ఏఎన్‌ఎంల ఆరోగ్య భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇక రెవెన్యూ సిబ్బంది సంగతి సరేసరి. విద్యుత్‌శాఖలోని సిబ్బంది సైతం విద్యుత్‌ సర్వీసులకు ఆధార్‌ అనుసంధానంపై సర్వే పేరిట పరుగులు తీయాల్సివస్తోంది. వీరంతా క్షణం తీరిక లేకుండా తమకు అప్పగించిన సర్వేలను పూర్తి చేయడానికి నానా అగచాట్లు పడుతున్నారు.

తీవ్ర మానసిక ఒత్తిడి

నెల రోజుల్లో జరగాల్సిన పనిని వారంలో పూర్తి చేయాలని, లేదంటే మెమోలు జారీ చేస్తామని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేస్తుండటంతో వీఆర్వోలు, ఏఎన్‌ఎంలు, సచివాలయ ఉద్యోగులు, విద్యుత్‌ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పని హడావుడి లో తమకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంటర్నెట్‌ అందక సకాలంలో వాటిని పూర్తి చేయలేక చాలా మంది ఉద్యోగులు ఆందోళన చెందుతూ మానసిక రుగ్మతలకు గురై బీపీ, షుగర్‌ వంటి రోగాల బారిన పడుతున్నారు. వారంలో ఆరు రోజులు సర్వేలతో తీవ్ర మనో వేదనకు గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

ఒకదాని వెంట మరొకటి...

వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్‌ఎంల పరిస్థితి మరీ దారుణం. ఒక సర్వే పూర్తి కాక ముందే మరో సర్వే నెత్తిన పెడుతున్నారని, రోజుకు 24 గంటలు పనిచేసినా లక్ష్యాలు పూర్తి కావని, అధికారుల వేధింపులతో పాటు వైద్యులు చెప్పిన పని చేయకపోతే జీతం రాదని బెదిరింపులు కూడా ఎక్కువయ్యాయని వాపోతున్నారు. వీఆర్వోలకు కూడా సర్వేలతో పాటు రెవెన్యూపరమైన పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ, వాటిని అందించిన తరువాత వారి నుంచి వివరాల సేకరణ, రీ సర్వే, మధ్య మధ్యలో బీఎల్‌వో(ఎన్నికల) విధులు, ఇవి కాకుండా నీటి తీరువా వసూళ్లు టార్గెట్‌ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడాలు లేకుండా ఒకటో తేదీన ఆదివారం సెలవు రోజు వస్తే ముందు రోజే పింఛన్లు పంపిణీ చేయించడం చేయిస్తూ సర్వేలతో సెలవులు ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారంటూ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. చివరకు పండగ రోజుల్లో కూడా విధులు నిర్వర్తించాలంటూ అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారని వాపోతున్నారు. డిపార్ట్‌మెంట్‌ జాబ్‌ చార్టు ప్రకారం ఏ విధులు నిర్వహించాలో కూడా స్పష్టత లేకుండా ఒకేసారి అన్ని విధులూ చేయలేక మానసిక ఆందోళనకు గురవుతున్నామని వాపోతున్నారు. పనిభారం అధికమై ఇటీవల సచివాలయ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలను సైతం సమర్పించారు. అయినా ఫలితం లేకపోయింది.

సర్వత్రా విమర్శలు

ఉన్నతాధికారులు సర్వేల పేరుతో సిబ్బందిని ఒత్తిడికి గురి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది పని భారాన్ని గమనించాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సర్వేల్లో భాగంగా ఓటీపీలు చెప్పడానికి ప్రజలు నిరాకరిస్తున్నారన్నారు. ఒక్కో కుటుంబాన్ని సర్వే చేయడానికి అరగంట సమయం పడుతోంది. తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సర్వేల ఒత్తిడిని తగ్గించాలని ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు కోరుతున్నారు.

చంద్రబాబు సర్కారులో క్షేత్రస్థాయిలో ఉద్యోగులు నిరంతర సర్వేలతో సతమతమవుతున్నారు. పని ఒత్తిడితో మానసిక వేదనకు గురవుతున్నారు. తమ బాధలు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉద్యోగుల హఠాన్మరణాలు, బలవన్మరణాలు జరుగుతున్నాయి. అయినా పాలకుల వైఖరి మారడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement