కృష్ణమ్మ ఒడి వజ్రాల మడి.. | - | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ ఒడి వజ్రాల మడి..

Aug 3 2023 1:34 AM | Updated on Aug 3 2023 10:51 AM

- - Sakshi

వర్షాల సీజన్‌ అంటే.. రైతులకే కాదు..వజ్రాల వేటగాళ్లకు పండుగే.. అన్నదాతల కంటే ఎక్కువగా వేటగాళ్లు వర్షాల కోసం ఎదురు చూస్తారని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వజ్రాలకు ప్రసిద్ధిగాంచిన నందిగామ ప్రాంతం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వజ్రాల వేటగాళ్లతో సందడిగా మారింది.

నందిగామ: కృష్ణానది పరివాహక ప్రాంతంలో వజ్రాల వేట అనాదిగా వస్తున్న సంప్రదాయమే. ముఖ్యంగా చందర్లపాడు మండలం గుడిమెట్ల సమీపంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో వజ్రాల గుట్టగా పిలిచే కొండ ప్రాంతం వర్షాకాలం వచ్చిందంటే వజ్రాల అన్వేషణకు వచ్చిన వారితో సందడిగా కనిపిస్తుంది.

నిత్యం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వందలాదిమంది ఈ వజ్రాల వేటకు వస్తుంటారు. కొందరు ఉదయమే భోజనాలు కట్టుకుని వచ్చి రామన్నపేట ప్రాంతంలోని కొండ ప్రాంతంలో తవ్వకాలు మొదలు పెడతారు. సాయంత్రం చీకట్లు కమ్ముకునే వరకు వీరి వెదుకులాట కొనసాగుతూనే ఉంటుంది.

కృష్ణా తీరం వజ్రాల గని
గతంతో పోల్చుకుంటే... ప్రస్తుతం వజ్రాల లభ్యత గణనీయంగా తగ్గినప్పటికీ, వెదికే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కనీసం రంగు రాళ్లు లభించినా, కూలి ఖర్చులైనా గిట్టుబాటవుతాయనే భావనలో చాలా మంది ఉంటారు. ఏటా తొలకరి జల్లులు మొదలుకొని వర్షా కాలం పూర్తయ్యే వరకు ఇక్కడ వజ్రాల వేట కొనసాగుతుంది.

నిత్యం 200 మంది వరకు ఇక్కడ అన్వేషణ సాగిస్తుండటం గమనార్హం. అత్యంత ఖరీదైన కోహినూర్‌ వజ్రం సైతం కంచికచర్ల మండలం పరిటాల చెరువు ప్రాంతంలో దొరికిందని స్థానికులు చెబుతుంటారు. గతంలో చందర్లపాడు మండలంలో వజ్రాల శుద్ధి కర్మాగారంతో పాటు వజ్రాల కోత పరిశ్రమ కూడా ఉండేదని, కాలక్రమేణా వజ్రాల కర్మాగారం తీసివేశారని చెబుతారు.

క్యూ కడుతున్న వ్యాపారులు
చందర్లపాడు మండలంలోని గుడిమెట్ల కొండ ప్రాంతంలో లభించే రంగు రాళ్లు, వజ్రాలు కొనుగోలు చేసేందుకు తమిళనాడు, ముంబయి, హైదరాబాదు, ఖమ్మం ప్రాంతాల నుంచి నిత్యం అనేక మంది వ్యాపారులు వచ్చి వెళుతుంటారు. వజ్రాల వేట ప్రారంభమైన నేపథ్యంలో వ్యాపారుల రాక కూడా ప్రారంభమైందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం వజ్రాల వేట నిషేధమని వేటకు వెళితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement