ఆసిఫాబాద్‌క్రైమ్: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్‌ఎం) డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్ గురువారం మానిక్‌గడ్– కాజీపేట రైల్వే సెక్షన్‌లో రియర్ విండో ఇన్‌స్పెక్షన్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, రైల్వే ట్రాఫిక్ నిర్వహణ, అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. ఈ క్రమంలో ఉదయం 9.50 గంటలకు సిర్పూర్ టౌన్ రైల్వే స్టేషన్‌కు డీఆర్‌ఎం చేరుకుని 10.15 గంటల వరకు తనిఖీలు నిర్వహించనున్నారు. అనంతరం 10.30 గంటలకు కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. 11.15 గంటల వరకు స్టేషన్ పరిసరాలు పరిశీలించనున్నారు.
మూడో ప్లాట్‌ఫాంపై సౌకర్యాల లేమి..!
కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో మూడో ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రయాణికులకు అవసరమైన కనీస సదుపాయాలు కల్పించలేదు. టికెట్ బుకింగ్ కౌంటర్, వేచి ఉండేందుకు ఆశించిన స్థాయిలో షెల్టర్లు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టికెట్ కొనుగోలు చేయాలంటే మూడో ప్లాట్‌ఫామ్ నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కి మొదటి ప్లాట్‌ఫామ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలతో ప్రయాణించే వారు ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైకి ఎక్కి దిగేందుకు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో ప్లాట్‌ఫామ్ సమస్యలను అధికారులు, రైలు ప్రయాణికుల సంక్షేమ సంఘాల నాయకులు డీఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లాలని ప్రయాణికులు కోరుతున్నారు. డీఆర్‌ఎం పర్యటనకు అన్ని విభాగాల రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


