హైవేకు సై..! | - | Sakshi
Sakshi News home page

హైవేకు సై..!

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

మరోసారి తెరపైకి బెల్లంపల్లి– గడ్చిరోలి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ఇటీవల కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ‘పాల్వాయి’ హైవే నిర్మాణానికి సానుకూలత పనులు పూర్తయితే తీరనున్న రవాణా కష్టాలు

కౌటాల: తెలంగాణ– మహారాష్ట్ర మధ్య రవాణా సౌకర్యాన్ని విస్తరించడంతో పాటు వాణిజ్య, పర్యాటక రంగానికి మహర్దశ తెచ్చే ప్రతిష్టాత్మక బెల్లంపల్లి– గడ్చిరోలి గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి నిర్మాణం మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ– మహారాష్ట్ర మధ్య రవాణాను మెరుగుపర్చేందుకు మంచిర్యాల జిల్లా తాండూరు నుంచి కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పలు మండలాల మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి వరకు సుమారు 63.2 కి.మీ. మేర జాతీయ రహదారి నిర్మాణానికి మూడేళ్ల కిందట అనుమతులు వచ్చాయి. అటవీ అనుమతులు, ఇతర సాంకేతిక అడ్డంకుల కారణంగా నిలిచిపోయిన ఈ హైవే పనులను వేగవంతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ఇటీవల ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి జాతీయ రహదారి నిర్మాణం, దాని ఆవశ్యకతను వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి అంతర్రాష్ట్ర జాతీయ రహదారిని తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే గత జూలై 24న కూడా ఈ జాతీయ రహదారిని మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజల్లో జాతీయ రహదారిపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

ఎనిమిది మండలాలను కలుపుతూ..

ప్రగతి చిహ్నాలైన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తుంటాయి. జిల్లాల అనుసంధానంతో పర్యాటక, వాణిజ్య, వ్యాపార లావాదేవీలు వృద్ధి చెంది, రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊతం వస్తుంది. ఇందులో భాగంగా బెల్లంపల్లి –గడ్చిరోలి హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మంచిర్యాల జిల్లా తాండూర్‌ నుంచి ప్రారంభం కానున్న ఈ రహదారి.. కాసిపేట, బెల్లంపల్లి, భీమిని మండలాలతో పాటు కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన, దహెగాం, కాగజ్‌నగర్‌ మండలం, సిర్పూర్‌(టి), కౌటాల మండలాలను కలుపుతూ రాష్ట్ర సరిహద్దున ప్రవహిస్తున్న వార్దా నది మీదుగా మహారాష్ట్రలోని కిర్‌మిర్‌ గ్రామం నుంచి గడ్చిరోలి వెళ్లే జాతీయ రహదారిని కలుపుతుంది. సుమారు 1,200 ఎకరాల మేర భూసేకరణకు అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగజ్‌నగర్‌ మండలం మోసం, సిర్పూర్‌(టి) మండలం చింతకుంట, పెద్దబండ, లక్ష్మీపూర్‌ సమీపంలో అటవీ ప్రాంతం గుండా గతంలో అధికారులు సర్వే చేపట్టారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అనుమతులు రాక పనులు నిలిచిపోయినట్లు సమాచారం. ఈ విషయంలో కేంద్రం తగిన పునరాలోచనలు జరిపి ఈ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

అభివృద్ధికి మార్గం..

హైవే రోడ్డుతో ఆయా ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయి. రోడ్డు సౌకర్యాలు మెరుగుపడడంతో పర్యాటకులు సులువుగా ప్రయాణిస్తారు. అలాగే ప్రధాన రహదారుల వెంబడి ఆర్థిక కారిడార్లు, పారిశ్రామిక సమూహాలు ఏర్పడతాయి. ఈ రహదారి పూర్తయితే తెలంగాణ– మహారాష్ట్ర మధ్య రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. గడ్చిరోలి జిల్లా సూర్జాఘడ్‌లో ముడి ఇనుము ఫ్యాక్టరీ, మైనింగ్‌ కార్యకలాపాలు ప్రారంభం కావడంతో ప్రస్తుతం నిత్యం అక్కడి నుంచి వందలాది లారీలు సిర్పూర్‌(టి) మీదుగా హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ నగరాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో జిల్లాలోని అంతర్గత రహదారులు దెబ్బతినడంతో పాటు భారీ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. ఫలితంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బెల్లంపల్లి– గడ్చిరోలి రహదారి నిర్మాణం పూర్తయితే రవాణా వ్యవస్థ మరింత సులువు కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement