కుటుంబాలకు అండగా నిలుస్తున్న కుమార్తెలు
కౌటాల: మా ఇద్దరు కూతుర్లే మాకు కొడుకులని అంటున్నారు కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడ పద్మ, భీరయ్య దంపతులు. భీరయ్య చిన్న కిరణం నిర్వహిస్తుండగా.. పద్మ గృహిణి. కుమార్తెలు ప్రీతి, లావణ్యను భారంగా భావించకుండా ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమార్తె ప్రీతి ఎంఫార్మసీ పూర్తి చేసిన అనంతరం వివాహం చేసుకుంది. చిన్న కుమార్తె లావణ్య ఎంబీబీఎస్ చదివి ప్రస్తుతం ఎండీ కోసం సన్నద్ధత అవుతున్నారు. కుటుంబానికి అండగా నిలుస్తున్న కుమార్తెలిద్దరినీ చూసి తల్లిదండ్రులు గర్విహిస్తున్నారు.
చిన్నతనంలోనే తండ్రి చనిపోయినా కుంగిపోలేదు. చెల్లెళ్ల కోసం తండ్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వారికి పెళ్లిళ్లు చేశారు. కుటుంబానికి కొండంత అండగా నిలుస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో రాణిస్తున్నారు ఆసిఫాబాద్ ఏఎంసీ చైర్‌పర్సన్ ఇరుకుల్ల మంగ. తండ్రి గోవిందు చిన్నతనంలో మృతి చెందాడు. వయసు పైబడిన తల్లి. ముగ్గురు చెల్లెలు, ఇద్దరు సోదరులు ఉన్న కుటుంబానికి పెద్ద కూతురు మంగ అన్నీ తానై నిలిచారు. ముగ్గురు చెల్లెళ్లు సునీత, రమాదేవి, మాధవిల వివాహాలు జరిపించారు. సోదరులు చేయలేని పనులు సైతం చేస్తూ సమాజంలో గట్టిగా నిలబడ్డారు. ప్రస్తుతం ఏఎంసీ చైర్‌పర్సన్‌గా రైతులకు సేవ చేస్తూ రాజకీయంగా ఎదుగుతున్నారు. కొడుకు కంటే ఆడబిడ్డలు తక్కువ కాదని, కుమార్తెతోనూ ఇళ్లు నిలబడుతుందని రుజువు చేశారు.
ఆసిఫాబాద్: ఆడబిడ్డలు పుడితే భారంగా భావించే సమాజంలో కూతుళ్లే కొడుకుల కంటే ఎక్కువ అని నిరూపించారు జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం తుంగూరుకు చెందిన అర్షకోట ఉష, రమేశ్ దంపతులు. సాధారణ రైతు కుటుంబమైనప్పటికీ పిల్లల చదువు విషయంలో దంపతులు వెనుకడుగు వేయలేదు. కష్టపడి ముగ్గురినీ ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమార్తె మానస బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, రెండో కూతురు మానస సీఏ పూర్తి చేసింది. ఇక మూడో కుమార్తె మనూష బీటెక్ పూర్తి చేసి ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. అమ్మమ్మ ఊరు ఆసిఫాబాద్‌లో ఉద్యోగం చేయడం ఆనందంగా ఉందని మనూష చెబుతున్నారు.
చెల్లెళ్లకు తండ్రిగా.. కుటుంబానికి అండగా
పెళ్లి చేసి పంపిస్తే ఆడపిల్ల బాధ్యత తీరిపోయిందనే రోజులు పోయాయి. నేటి తరం తల్లిదండ్రుల ఆలోచన విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కుమార్తెలను భారం అనుకోవడం లేదు. కొడుకులు లేకున్నా ఆడబిడ్డలే తమ బలమని నమ్ముతూ ఉన్నత చదువులు చదివిస్తున్నారు. బిడ్డలను ఉన్నత స్థాయిలో నిలపాలని నిరంతరం శ్రమిస్తున్నారు. మరోవైపు కుమార్తెలు సైతం ఉద్యోగాలు సాధించి ‘మేమున్నాం’ అని అండగా నిలుస్తున్నారు. కొడుకు లేని లోటును తీరుస్తూ తల్లిదండ్రులు గర్వపడేలా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. ఆదివారం డాటర్స్ డే సందర్భంగా ప్రతీ ఇంటికి బలమైన పునాదిగా నిలుస్తున్న మహిళామణులపై ప్రత్యేక కథనం.


