గుర్తింపు ఎన్నికల నిర్వహణకు ముందుకురాని సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం నిరసనలు ఉధృతం చేసే యోచనలో జేఏసీ నాయకులు ఎస్పీఎం గేటు ఎదుట కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు నిర్వహణపై సందిగ్ధంతొలగడం లేదు. కార్మిక సంఘాలు 21 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాయి. యాజ మాన్యం నుంచి స్పందన లేకపోవడంతో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు, భారీ బహిరంగ సభ నిర్వహణకు జేఏసీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్పీఎంలో 2014 నుంచి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు జరగడం లేదు. 2018లో నిర్వహించాల్సి ఉన్నా యాజమాన్యం వివిధ కారణాలను సాకుగా చూపుతూ వాయిదా వేస్తోంది. ప్రస్తుతం మిల్లులో 373 మంది పర్మినెంట్ కార్మికులు, 600 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 800 మంది జాబ్ కార్మికులు, ఏసీఎస్ కంట్రోల్ సిస్టంలో 415 మంది పని చేస్తున్నారు. మొత్తం 1,900 మందికి పైగా కార్మికులు ఉన్నారు.
కార్మిక సమస్యలపై పట్టింపేది..?
2014లో మూతపడిన మిల్లును 2018లో జేకే పేపర్ మిల్లు యాజమాన్యం టేకోవర్ చేసుకుని 1,050 మంది కార్మికులతో ఉత్పత్తి ప్రారంభించింది. అయితే కార్మికుల హక్కుల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్దసంఖ్యలో కార్మికులు ఉన్నా ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు సంఘం లేకపోవడంతో కార్మికుల సమస్యలు పట్టించుకునేవారు కరువయ్యారు. వేతన సవరణ, బోనస్, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి అంశాలపై మిల్లు ప్రతినిధులను నేరుగా అడిగే అవకాశం లేకుండా పోయింది. రెండేళ్లకు ఒక్కసారి నిర్వహించాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తుందని కార్మికులు వాపోతున్నారు.
కోర్టు పరిధిలో వివాదం
ప్రస్తుతం గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ వివాదం హైకోర్టు పరిధిలో ఉంది. ఈ వివాదం తొలగితే తప్ప ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం మిల్లులోని అన్ని కార్మిక సంఘాలు కలిసి ఐక్యమై జేఏసీగా ఏర్పడి ఎస్పీఎం గేటు ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. పరిశ్రమ విస్తరణ, ఉత్పత్తి పెంపుపై దృష్టి సారిస్తున్న యాజమాన్యం కార్మికుల ప్రజాస్వామ్య హక్కుల అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలను యాజమాన్యం నిర్వహించకుండా జాప్యం చేస్తుంది. ఎన్నికలను అడ్డుకునేందుకు కోర్టులో కేసు వేసింది. ఆ కేసును వాపసు తీసుకుని ఎన్నికలు నిర్వహించాలి. రానున్న రోజుల్లో ఎస్పీఎం గేటు ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం.
– వెంకటేశం, కార్మిక సంఘం నాయకుడు


