రాష్ట్రాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు జిల్లాలో మబ్బులతో చల్లబడిన వాతావరణం పలుచోట్ల తేలికపాటి వర్షం
ఆసిఫాబాద్: అన్నదాతలకు చల్లని కబురు అందిస్తూ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. త్వరలో రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. దీని ప్రభావంతో జిల్లాలోని పలుచోట్ల సోమవారం ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ సాయంత్రం వాతావరణం మబ్బులతో ఒక్కసారి చల్లబడింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి చేరడంతో రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కి దున్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎరువులు, విత్తనాలు సమకూర్చుకుంటున్నారు. వారం రోజులుగా ఎరువులు, విత్తనాల దుకాణాలు రైతులతో సందడిగా కనిపిస్తున్నాయి. వర్షం రాగానే విత్తనాలు విత్తేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2026– 27 సంవత్సరానికి ఖరీఫ్ సీజన్‌లో 4.52 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో 3.70 లక్షల ఎకరాల్లో పత్తి, 47 వేల ఎకరాల్లో వరి, 21 వేల ఎకరాల కంది, 7,500 ఎకరాల్లో మక్క, 5,700 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు. మొబైల్ యాప్ ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నారు. వారం రోజులుగా జిల్లాలో సాధారణ వర్షపాతం 18.4 మిల్లీమీటరు నమోదు కావాల్సి ఉండగా, 15.7 మిల్లీమీటర్లు కురిసింది. మొత్తం 15 మండలాల్లో 4 మండలాల్లో సాధారణం కంటే కాస్త అధికంగా వర్షం కురవగా, రెండు మండలాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. మరో తొమ్మిది మండలాల్లో వర్షాలు కురవలేదు.
కాగజ్‌నగర్ మండలంలో వర్షం
కాగజ్‌నగర్‌రూరల్: మండలంలో సోమవా రం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములతో మోస్తారు వర్షం ఉరుములతో కురిసింది. గాలుల ధాటికి భట్టుపల్లి గ్రామ పంచాయతీలోని మద్దెల జ్యోతి ఇంటి పైకప్పు రేకులు గాలికి ఎగిరిపోయాయి. వర్షానికి ఇంటి గోడ పూర్తిగా కూలింది. ఇంట్లో జ్యోతితో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులు ఉండగా వారికి ఎలాంటి గాయాలు కాలేదు. తలదాచుకునేందుకు నీడలేకుండా పోవడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. అలాగే నా మానగర్ వద్ద తాటిచెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి.


