కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకుని సరైన మార్గం చూపాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిశారు. ఎస్పీఎం కార్మికుల ఆందోళనల గురించి వివరించారు. 20 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా గుర్తింపు సంఘం ఎన్నికల గురించి పట్టించుకోకపోవడంతో కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్‌ను పిలిపించి పరిస్థితిపై సమీక్షించారు. కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 10న కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ప్రతినిధులు, ఎస్పీఎం యాజమాన్యంతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.


