ఆసిఫాబాద్: తెలుగు సంవత్సరాది ఉగాది రానే వచ్చింది. ఏటా చైత్ర మాసంలో శుక్లపక్షం పాడ్యమి తిథి రోజున జరుపుకుంటారు. ఒక్కో ఏడాదిలో వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. విశ్వావసు నామ సంవత్సరం మార్చి 18న ముగిసింది. మార్చి 19 నుంచి ఉగాది రోజు నుంచి శ్రీపరాభవ నామ సంవత్సరం ప్రారంభమైంది. చెట్ల కొమ్మల్లో చిగురించే కొత్త ఆశలు.. కోయిలమ్మ కుహూరాగాల ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ ఏడాది మంచి విజయం సాధిస్తుందని, చెడుకు పరాభవం తప్పదని పండితులు చెబుతున్నారు. ఆరు రుచుల సమ్మేళనంతో జీవిత పరమార్థాన్ని చాటిచెప్పే పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఆలయాల్లో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
షడ్రుచుల పచ్చడి
జీవితంలో ఎదురయ్యే వివిధ భావోద్వేగాలు, కొత్త ఆశలకు షుడ్రుచుల ఉగాది పచ్చడి ప్రతీక. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల కోసం బెల్లం, లేత మామిడి పిందెలు, కొత్త చింతపండు, ఉప్పు, లేత వేపపువ్వు, కారం వినియోగిస్తారు. అలాగే బొబ్బట్లు, పులిహోర, గారెలు, పాయసం వంటి సంప్రదాయ వంటలు చేసుకుని ఆరగిస్తారు. జిల్లావ్యాప్తంగా వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోనూ ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆలయాల్లో పంచాంగ శ్రవణం
ఉగాది రోజున పచ్చడి తర్వాత అంతే ప్రాధాన్యం ఉన్న మరో ఘట్టం పంచాంగ శ్రవణం. కొత్త సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండనున్నాయి..? తదితర విషయాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆలయాల్లో పంచాంగ శ్రవణ కార్యక్రమానికి హాజరవుతారు.
వ్యవసాయ పనులు ప్రారంభం
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం రైతులు ఏరువాక పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వేకువజామునే పంట పొలాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించనున్నారు. జిల్లా కేంద్రంలోని సాయి మందిరంలో ఆకసం(ఆసిఫాబాద్ కవుల సంఘం) ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


