ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ నియోజకవర్గ సమస్యలను బుధవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి అసెంబ్లీలో ప్రస్తావించారు. రోడ్లు, వంతెనల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు కొత్త పనులు చేయడానికి ముందుకు రావడం లేదని తెలిపారు. సరైన రోడ్లు లేక మంగీ, గుండాల, మోడి వంటి గ్రామాలకు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా వెళ్లడం ఇబ్బందిగా మారిందన్నారు. కెరమెరి ఘాట్‌రోడ్‌ను డబుల్ రోడ్‌గా విస్తరించాలని కోరారు. గుండి, అనార్‌పల్లి, ఇతర వంతెనలు పూర్తి చేయాలన్నారు.
అధ్వానంగా ఆర్‌అండ్‌బీ రోడ్లు
కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ నియోజకవర్గంలోని ఆర్‌అండ్‌బీ రోడ్లు అధ్వానంగా మారాయని ఎమ్మెల్యే పాల్యాయి హరీశ్‌బాబు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, అధికారులను ప్రశ్నిస్తే బాధితులపైనే కేసులు పెడుతున్నారని తెలిపారు. పెంచికల్‌పేట్, సల్గుపల్లి తదితర ప్రాంతాల్లోని అడవుల గుండా వెళ్లే రహదారులు పూర్తిగా ధ్వంసమై ఆర్టీసీ బస్సులు సైతం తిరగలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. అటవీశాఖ అనుమతులు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
99.68 శాతం హాజరు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో బుధవారం జరిగిన పదో తరగతి హిందీ పరీ క్షకు 6,949 మంది విద్యార్థులకు 6,927మంది (99.68శాతం) హాజరుకాగా, 22 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ కె.హరిత తనిఖీ చేశారు. పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ డేవిడ్ పరిశీలించగా, పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్, ఎంఈవో సుభాస్ పలు కేంద్రాలను తనిఖీ చేశారు.
డొమెస్టిక్ సిలిండర్లు పక్కదారి పట్టిస్తే చర్యలు
ఆసిఫాబాద్‌అర్బన్: డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాల కోసం పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు ఎట్టి పరిస్థితుల్లోనూ డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించొద్దన్నారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖల అధికారులతో కూడిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. గృహావసరాల సిలిండర్లు అక్రమంగా వినియోగించినా, నిల్వ ఉంచిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆస్పత్రులు, విద్యా సంస్థలు, వృద్ధాశ్రమాలు, అనాథ ఆశ్రమాలకు కొరత లేదని తెలిపారు.
విద్యార్థులు సరదా కోసం ఈతకు వెళ్లొద్దు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో ఒంటిపూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు సరదా కోసం ఈతకు వెళ్లి ప్రమాదాలకు గురికావొద్దని ఎస్పీ నితిక పంత్ ఒక ప్రకటనలో తెలిపారు. నీటిలోతు తెలియక జారిపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పెద్దల పర్యవేక్షణలో మాత్రమే ఈత నేర్పించాలని సూచించారు. గ్రామాల్లోని బావులు, చెరువుల వద్ద భద్రత పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పిల్లలను ఇంటి వద్ద ఉంచడం, సానుకూల కార్యకలాపాలపై దృష్టి సారించేలా చూడాలని సూచించారు.
మెరుగైన వైద్యం అందించాలి
వాంకిడి: ఆస్పత్రులకు వచ్చేవారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో సీతారాం అ న్నారు. మంగళవారం రాత్రి నార్లాపూర్ గ్రామంలో జరిగిన ఓ విందులో ఆహారం వికటించి పలువురు అస్వస్థతకు గురై వాంకిడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, బుఽ ధవారం వారి ఆరోగ్య పరిస్థితిని తె లుసుకున్నారు. అస్వస్థతకు గురైన 15 మందికి ఎలాంటి ప్రమాదం లేదని, ఒక రోజులో కోలుకుంటారని తెలిపారు. అనంతరం శివాలయం ప్రాంతంలోని అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. మండల వైద్యాధికారి వినయ్ ఉప్రే, సీహెచ్‌సీ వైద్యురాలు అయేషా తదితరులు ఉన్నారు.


