ఉగాదికి ‘శంకర్‌లొద్ది’ ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

ఉగాదికి ‘శంకర్‌లొద్ది’ ముస్తాబు

Mar 19 2026 8:21 AM | Updated on Mar 19 2026 8:21 AM

● నేడు శివుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు ● హాజరుకానున్న మహారాష్ట్ర మంత్రి

కెరమెరి: వందల ఏళ్ల చరిత్ర గల కెరమెరి మండలంలోని శంకర్‌లొద్దిలో గురువారం ఉగాది పర్వది నం ఘనంగా నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆది లాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజ లు, సేవాలాల్‌ భక్తులు తరలిరానున్నారు. మహా రాష్ట్ర మంత్రి సంజుభావు రాథోడ్‌ హాజరై ప్రత్యేక పూజలు చేయనున్నారు. అలాగే మహా సకల్ప యాత్రను ప్రారంభించనున్నారు. మహరాష్ట్రలోని సేవానగర్‌ నుంచి హెలిక్యాప్టర్‌ ద్వారా ఆయన రానున్నారు. పరంధోళి మీదుగా రోడ్డు మార్గంలో ప్రయాణించి భోగ్‌ భండార్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయన వెంట రాజుర ఎమ్మెల్యే దేవ్‌రావు భోంగ్డే వస్తారని నిర్వాహకులు తెలిపారు.

మహిమాన్విత ప్రాంతం

కెరమెరి మండలం కరంజివాడ పంచాయతీలోని శంకర్‌లొద్దిని బంజారా గురువు ప్రేంసింగ్‌ మహరాజ్‌ ఆరేళ్లు తపస్సు చేసిన మహిమాన్విత స్థలమని స్థానికులు చెబుతుంటారు. ఏటా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ జాతర నిర్వహిస్తారు. భక్తులు 20 ఫీట్ల ఎత్తులోని గుహలో కొలువైన శివలింగాన్ని దర్శించుకుంటారు. మహాశివరాత్రి నుంచి శ్రీరామనవమి వరకు 41 రోజుల సేవాలాల్‌ దీక్ష స్వీకరించే బంజారాలు శంకర్‌లొద్దిని ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తారు. అనేక మంది సేవాలాల్‌ భక్తులు పాదయాత్రగా ఇక్కడికి చేరుకుంటారు. శంకరుడితోపాటు దుర్గాదేవి, సేవాలాల్‌ మహరాజ్‌కు పూజలు చేస్తారు. బుధవారం రాత్రి నుంచే భజనలు ప్రారంభించారు. స్థానికంగా ఉన్న గంగలో పుణ్యస్నానాలు ఆచరించి జెండాలు, ప్రతిమలకు మొక్కులు చెల్లిస్తారు.

ఆదివాసీలకు ‘సిద్దకస’

శంకర్‌లొద్దికి సమీపంలో జంగుబాయి అమ్మవారి గుహ ఉంది. ఏటా రెండుసార్లు జంగుబాయి ఉత్సవాలకు వెళ్లే ఆదివాసీలు శంకర్‌లొద్దిలోని శివుడిని సైతం దర్శించుకుంటారు. అయితే ఆదివాసీలు దీనిని సిద్దికసగా పిలుస్తారు.

సేవాలాల్‌ భక్తుల పాదయాత్ర

శంకర్‌లొద్దిలో పూజల అనంతరం మహరాష్ట్రలోని వాసీమ్‌ జిల్లాలో ఉన్న పొహరాదేవి ఆలయానికి సేవాలాల్‌ భక్తులు గురువారం పాదయాత్రగా బయలుదేరనున్నారు. సుమారు ఐదు వేల మంది శంకర్‌లొద్ది నుంచి సుమారు 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొహరాదేవి ఆలయానికి ఆదిలాబాద్‌ మీదుగా శ్రీరామనవమి రోజు నాటికి చేరుకుంటారు. మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తులు వీరితో కలవనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement