ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. బుధవారం పార్లమెంటు సమావేశంలో ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక రైల్వే సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్–గడ్చందుర్ మధ్య కొత్త రైల్వేలైన్ సర్వే ఇప్పటికే పూర్తయిందని, డీపీఆర్‌ను వెంటనే ఆమోదించి పనులు ప్రారంభించాలని, ముద్ఖేడ్–పిప్పల్‌కోటి (ఎల్‌సీ33), కాజీపేట–బల్హార్షా (ఎల్‌సీ71) వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు 36 కిలోమీటర్ల మేర డీపీఆర్ సిద్ధంగా ఉందని, దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. బాసర సరస్వతీదేవి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అక్కడ మరిన్ని రైళ్లకు స్టాపేజీలు కల్పించాలని, కాజీపేట నుంచి కాగజ్‌నగర్ మీదుగా హౌరా వరకు కొత్త రైలును ప్రారంభించాలని విన్నవించారు. ప్రాంతీయ అభివృద్ధికి ఈ రైల్వే ప్రాజెక్టులు ఎంతో కీలమని, కేంద్ర ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.


