ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సాధ్యమే
ఆసిఫాబాద్‌అర్బన్: క్యాన్సర్, క్షయ వంటి వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సాధ్యమేనని కలెక్టర్ కె.హరిత అన్నారు. ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో సంపూర్ణత అభియాన్ 2.0లో భాగంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాలో క్యాన్సర్ విస్తరించకుండా వైద్యారోగ్యశాఖ, మహిళాశిశు సంక్షేమశాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 128 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అనంతరం సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధికారులు, సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ డేవిడ్, శిక్షణ ఐఎఫ్‌ఎస్ అధికారి భార్గవ్‌కుమార్, డీఎంహెచ్‌వో సీతారాం, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీటీడీవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
చిత్తడి నేలల గుర్తింపుతో ఆక్రమణకు అడ్డుకట్ట
ఆసిఫాబాద్: చెరువులను చిత్తడి నేలలుగా గుర్తించి, ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో చిత్తడి నేలల గుర్తింపుపై డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, కాగజ్‌నగర్ ఎఫ్‌బీవో అప్పయ్య, ట్రెయినీ ఐఎఫ్‌ఎస్ భార్గవ్‌కుమార్‌తో కలిసి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెంచికల్‌పేట్ మండలంలోని ఎల్లూర్ చెరువును చిత్తడి నేలగా గుర్తించడం ద్వారా ఆక్రమణకు గురికాకుండా కట్టడి చేశామన్నారు. నీటి సామర్థ్యం పెంచడం ద్వారా సాగునీరు, పశువులకు తాగునీరు అందుబాటులో ఉంటుందని తెలిపారు. తిర్యాణి మండలం చెలిమెల ప్రాజెక్టును చిత్తడి నేలగా గుర్తించి, అవసరమైన అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీపీవో భిక్షపతి, డీఏవో వెంకటి, మత్స్యశాఖ అధికారి సాంబశివరావు, ఇరిగేషన్ ఈఈలు గుణవంత్‌రావు, ప్రభాకర్, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.


