పన్ను వసూళ్లలో జాప్యం!
తిర్యాణి: పంచాయతీల్లో పన్నుల వసూళ్లు ఊపందుకోలేదు. గడువు సమీపిస్తున్నా ఇంకా నెమ్మదిగా సాగుతోంది. దీంతో గడువులోగా పన్నుల లక్ష్యం సాధించడం గగనంగా మారింది. పంచాయతీల్లో నిధుల్లేక పాలకవర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గ్రామాల అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరు పన్నులు వసూళ్లు. మేజర్ పంచాయతీలను మినహాయిస్తే చాలా పల్లెలకు ఇంటి పన్నులే ఆధారం. 2025– 26 ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండు నెలల గడువు మాత్రమే ఉంది. జిల్లాలో ఇప్పటివరకు లక్ష్యంలో కేవలం 31.8 శాతం మాత్రమే సాధించారు. నెల క్రితం వరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనుల్లో అధికారులు బిజీగా గడిపారు. ఇప్పుడిప్పుడే వసూళ్లపై దృష్టి సారిస్తున్నారు. పంచాయతీ సిబ్బంది ఉదయం నుంచి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
రూ.6.05 కోట్ల లక్ష్యం
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో నూతన పాలక వర్గాలు కొలువుదీరాయి. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంచాయతీల నుంచి ఆస్తి పన్నులు, పన్నేతర చార్జీల రూపంలో రూ 6.05కోట్లు వసూళ్లు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటివరకు రూ.1.91 కోట్లు మాత్రమే వసూళ్లు జరిగాయి. జిల్లాలో అత్యధికంగా ఆసిఫాబాద్ మండలంలో 56 శాతం, పెంచికల్‌పేట్‌లో 53 శాతం, కెరమెరిలో 50 శాతం వరకు పన్ను వసూళ్లయ్యాయి. మరోవైపు అత్యల్పంగా చింతలమానెపల్లి మండలంలో 14 శాతం, జైనూర్‌లో 22 శాతం, తిర్యాణిలో 23 శాతం పన్నులు వసూళ్లయ్యాయి. తిర్యాణి లాంటి కొన్ని మండలాల్లో ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు తమను గెలిపిస్తే ఐదేళ్లపాటు ఇంటి పన్నులను తమ సొంత డబ్బులతో చెల్లిస్తామని సర్పంచ్ అభ్యర్థులు హామీలు గుప్పించారు. దీంతో పన్ను వసూళ్లలో కొంత జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
పన్నులే కీలకం..
పల్లెలో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిదీపాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు తదితర పనులు కోసం పన్నుల రూపంలో వచ్చిన నిధులను వినియోగిస్తారు. ట్రాక్టర్, వాటర్ ట్యాంక్ నిర్వహణతోపాటు మల్టీపర్పస్ వర్కర్ల వేతనాలకు ప్రభుత్వం కేటాయించే నిధులు ఉపయోగపడుతాయి. కానీ రెండు సంవత్సరాలుగా పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం పంచాయతీ సంబంఽధించిన నిధులు విడుదల చేయలేదు. ఇంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కీలకంగా మారింది.
మండలాల వారీగా పన్నుల వసూలు(రూ.లలో)
మండలం లక్ష్యం వసూళ్లు శాతం
ఆసిఫాబాద్ 41,65,020 23,06,852 56
బెజ్జూర్ 34,98,241 8,29,718 24
చింతలమానెపల్లి 28,10,373 4,02,192 14
దహెగాం 28,61,982 8,28,061 29
జైనూర్ 36,09,932 6,85,325 22
కాగజ్‌నగర్ 65,79,487 22,54,057 35
కెరమెరి 37,60,562 18,89,315 50
కౌటాల 59,52,533 17,24,261 29
లింగాపూర్ 10,85,994 3,85,758 36
పెంచికల్‌పేట్ 14,13,294 7,46,175 53
రెబ్బెన 84,99,381 21,47,340 26
సిర్పూర్(టి) 43,82,448 19,53,379 45
సిర్పూర్(యూ) 10,56,175 4,75,498 45
తిర్యాణి 35,47,860 7,90,943 23
వాంకిడి 73,29,795 17,70,759 24
ప్రత్యేక కార్యాచరణతో
వసూళ్లు
జిల్లాలో దాదాపు 50 శాతం వరకు ఇంటి పన్నుల వసూళ్లు పూర్తయ్యాయి. కానీ 31.8 శాతం సంబంధించిన పన్నుల వివరాలను ఆన్‌లైన్ చేశాం. మిగతావి త్వరలోనే ఆన్‌లైన్‌లో పొందుపరుస్తాం. ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలోగా వందశాతం పన్నులు వసూలు చేయాలని ఇప్పటికే పంచాయతీ సిబ్బందికి సృష్టమైన ఆదేశాలు జారీచేశాం. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. జిల్లా ప్రజలందరూ సహకరించి సకాలంలో పన్నులు చెల్లించాలి.
– భిక్షపతిగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి


