మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధం
ఆసిఫాబాద్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ కె.హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్‌లో ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు ఆర్వోలు, ఏఆర్వోలను నియమించి, వారికి శిక్షణ అందించామన్నారు. ఆసిఫాబాద్‌లోని 9 ప్రాంతాల్లో 28 పోలింగ్ స్టేషన్లు, కాగజ్‌నగర్‌లోని 28 ప్రాంతాల్లో 85 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో వీడియో, వెబ్ కాస్టింగ్ చేస్తామన్నారు. ఆసిఫాబాద్‌కు రెండు స్టాటిస్టిక్, ఒక ఫ్లయింగ్ సర్వేయలెన్స్ బృందాలు, కాగజ్‌నగర్‌కు రెండు స్టాటిస్టిక్, ఒక ఫ్లయింగ్ సర్వేయలెన్స్ బృందాలు పని చేస్తున్నాయని వివరించారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశామని, కాగజ్‌నగర్‌లో పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని వార్డుల్లో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయిస్తామని, పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ పాత నేరస్తులను బైండోవర్ చేస్తున్నామని, అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉండడంతో ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ర్యాలీల అనుమతి కోసం 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవా లని సూచించారు. లౌడ్‌స్పీకర్లకు ఎస్డీపీవోల వద్ద అ నుమతి పొందాలని, లైసెన్సుడ్ ఆయుధాలు కలిగి న వారు డిపాజిట్ చేయాలని, ఇతర వివరాలకు స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మొబైల్ నం. 87126 70505లో సంప్రదించాలని తెలిపారు. నామినేషన్ తిరస్కరింపబడితే ఆసిఫాబాద్ ఆర్డీవో, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్‌ను సంప్రదించాలని సూచించారు.
రాజకీయ పార్టీలు సహకరించాలి
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. కంట్రోల్‌రూమ్ నం.85008 44365 ద్వారా ఫిర్యాదులు, సమస్యలు తెలియజేయవచ్చన్నారు. సమావేశంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.


