గద్దెలపైకి సారలమ్మ
రెండేళ్లకొకసారి వచ్చే వన దేవతల జాతర మహోత్సవం బుధవారం సారలమ్మ రాకతో మొదలైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవారికి ఒడిబియ్యం, ఎత్తు బంగారం, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కోళ్లు, మేకలను బలిచ్చి పూజలు చేశారు. కంకల వనం నుంచి పూజారులు దేవార వినోద్, గొల్లపెల్లి సత్తమ్మ రెబ్బెన మండలం లక్ష్మిపూర్ శివారులో గద్దెల వద్ద సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజును ప్రతిష్టించారు. అలాగే గోలేటి పంచాయతీ పరిధిలోని పల్లవీ ఫ్యాక్టరీ వెనక భాగంలో ఉన్న గద్దెల వద్ద పూజారి ఇగురపు స్వామి సారలమ్మను గద్దైపె ప్రతిష్టించారు. ఆసిఫాబాద్ మండలం బూర్గుడ పంచాయతీ పరిధిలోని కేస్లాపూర్ వన దేవతలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి మొక్కులు చెల్లించారు. కుటుంబ సమేతంగా భరిణి, పసుపు, కంకవనం తదితర పూజా సామగ్రితోపాటు బంగారం(బెల్లం) ఎత్తుకుని ఇంటి నుంచి వచ్చి పూజలు చేశారు. గోలేటి శివారులోని గద్దెలను సర్పంచ్ అజ్మీర బాబురావు దర్శించుకుని పూజలు చేశారు.
– ఆసిఫాబాద్‌రూరల్/రెబ్బెన
గద్దెలపైకి సారలమ్మ
గద్దెలపైకి సారలమ్మ


