విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ హరిత అన్నారు. మండలంలోని పాడిబండ దిశామోడల్ స్కూల్‌ను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, వంటశాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి అభ్యసన సామర్థ్యాలు పరీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకం ప్రజలకు కలిగించాలన్నారు. పిల్లలు ప్రతిరోజూ పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
‘పది’ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారితో కలిసి ఎంఈవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు సమయం తక్కువగా ఉందని, విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎంఈవోలు తమ పరిధిలోని పాఠశాలలను ప్రతిరోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, ఎంఈవోలు సుభాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


