తాత్కాలిక ఏర్పాట్లతోనే సరి..!
అభివృద్ధికి నోచుకోని బాలాజీ వెంకన్న ఆలయం సరైన దారి సౌకర్యం లేక భక్తులకు అవస్థలు హారతి కర్పూరంలా కరుగుతున్న ఆదాయం ఈ నెల 31 నుంచి గంగాపూర్ జాతర ప్రారంభం
రెబ్బెన: ప్రసిద్ధిగాంచిన రెబ్బెన మండలం గంగాపూర్‌లోని శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అసౌకర్యాల మధ్యే భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు. కేవలం జాతర సమయంలోనే అధికారులు, పాలకుల హడావుడి కనిపిస్తోంది. తాత్కాలిక ఏర్పాట్లతో చేతులు దులుపుకొంటున్నారు. మహోత్సవం పూర్తయిన తర్వాత ఇటువైపు కన్నెతి చూడడం లేదు. దీంతో ఘనమైన చరిత్ర కలిగిన ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఏటా రూ.లక్షల్లో ఆదాయం వస్తున్నా జాతర నిర్వహణ, ఇతర ఖర్చులకే నిధులు హారతి కర్పురంలా కరిగిపోతున్నాయి. అభివృద్ధికి మాత్రం ఒక్క రూపాయి ఉపయోగపడటం లేదని భక్తులు ఆగ్రహిస్తున్నారు.
దారే ప్రధాన సమస్య
గంగాపూర్ శివారులో స్వయంభూగా వెలిసిన శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు రెండో తిరుపతిగా భావించి ఆలయానికి వస్తుంటా రు. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 31 నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తారు. ఇతర రోజుల్లోనూ భక్తుల తా కిడి అధికంగా ఉంటుంది. కానీ దారి సమస్యతో తి ప్పలు తప్పడం లేదు. గంగాపూర్ వాగుపై ప్రధాన రోడ్డు నుంచి ఆలయం వరకు వంతెన సౌకర్యం కల్పించాలని ఏళ్లుగా వేడుకుంటున్నారు. జాతర స మయంలో తాత్కాలిక దారి సౌకర్యం కల్పిస్తున్నా రు. వర్షాకాలంలో వాగు ప్రవాహానికి అది కొట్టుకుపోతోంది. ఆలయం వరకు వాహనాలు వెళ్లే వీలు లేక ప్రముఖులు సైతం వాగులో నుంచి నడిచి వెళ్లాల్సి వస్తోంది. తలనీలాలు, వ్రతాలు, ఇతర శుభకా ర్యాలకు వచ్చే భక్తులు దారి సౌకర్యం లేక ఆలయం వరకు సామగ్రిని మోసుకెళ్తున్నారు. ఆలయం వెను క భాగంలో ఉన్న గుట్ట పైనుంచి గతంలో దారి కో సం ఏర్పాట్లు చేసినా వర్షాలకు దెబ్బతిని వినియోగంలో లేకుండా పోయింది.
కలగానే మండపం
మూడు రోజుల జాతర మహోత్సవంలో భాగంగా పౌర్ణమికి ఒక్కరోజు ముందు వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. గతంలో రూ.25లక్షల నిధులతో కల్యాణ మండపం మంజూరైనా పనులు పూర్తికాలేదు. దాతల సహకారంతో సిమెంట్ పూతలు పూర్తి చేశారు. అది అన్నప్రసాద వితరణ కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగపడుతోంది. స్వామి వారి కల్యాణాన్ని వాగులో టెంట్ల కింద నిర్వహిస్తున్నారు. అలాగే మూడేళ్ల క్రితం క్యూలైన్ల మండపం నిర్మాణం కోసం రూ.50లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కానీ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. రె బ్బెనలోని రైల్వేగేట్ నుంచి ఆలయం వరకు డబుల్ రోడ్డు పనులు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయి. అధి కారులు, పాలకులు ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
ఆలయం ఎదుట
వాగులో తాత్కాలికంగా వేసిన దారి
ఆలయంపై పట్టింపేది..?
జాతర ఖర్చులు ఆలయానికి వచ్చే ఆదాయాన్ని హారతి కర్పూరంలా కరిగిస్తున్నాయి. తైబజార్, పార్కింగ్, బస్టాండ్ వంటి అవసరాలకు ఆలయానికి సొంత స్థలం లేదు. రైతుల నుంచి అద్దెకు స్థలానికి తీసుకుంటున్నారు. మూడు రోజుల కోసం పార్కింగ్, తైబజార్ నిర్వహణ స్థలానికి దాదాపు రూ.5లక్షల వరకు వెచ్చిస్తున్నారు. ఆలయం ముందు, వాగుపై తాత్కాలిక రోడ్డు సౌకర్యం కోసం ట్రాక్టర్లతో మట్టిని పోసి చదును చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా సింగల్‌గూడ, పాత కోల్‌యార్డుల వైపు ప్రత్యామ్నాయ రోడ్లను ఏర్పాటు చేసి దారి మళ్లిస్తున్నారు. ఆయా రోడ్ల కోసం వందల ట్రిప్పుల మట్టి పోస్తున్నా.. వర్షాకాలంలో వర్షాలకు రోడ్లు నీటిపాలవుతున్నాయి. మరోవైపు జాతరకు వారం రోజుల నుంచి ఏర్పాట్లను పర్యవేక్షించే అధికారులు.. మహోత్సవం పూర్తయ్యాక కన్నెత్తి చూడరనే అపవాదు ఉంది. సాధారణ రోజుల్లో కనీస వసతులు ఉండవు. దూరప్రాంతాల నుంచి వచ్చేవారు స్వామి వారి సన్నిద్ధిలో బస చేసేందుకు నేటికీ ఏర్పాట్లు లేవు. వసతి గదులు ఏర్పాటు చేస్తే భక్తుల రాక పెరిగే అవకాశం ఉన్నా అటువైపు దృష్టి సారించడం లేదు.
తాత్కాలిక ఏర్పాట్లతోనే సరి..!


