ఖమ్మంమయూరిసెంటర్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి రాకేష్ దత్తా బుధవారం కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను కలిసిన ఆయన ఓబీసీల హక్కులు, సామాజిక న్యాయం, రిజర్వేషన్ల అంశాలను వివరించారు. 2027 జనాభా లెక్కల్లో అన్ని కులాలకు సంబంధించిన వివరాల నమోదు, ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన తగిన ప్రాతినిధ్యం, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితి తొలగింపు అంశాల్లో ఉద్యమానికి సహకరించాలని కోరారు. అలాగే, డిమాండ్ల సాధనకు ఈనెల 28న ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలపాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్‌కుమార్, నాయకులు వసుంధర, జయంత్ యాదవ్, రజినీకాంత్ గౌడ్, ఉమేష్ పాల్గొన్నారు.
సెమీస్‌కు చేరిన
టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీ
ఖమ్మం మయూరిసెంటర్(ఖమ్మం స్పోర్ట్స్): ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న ఆల్ ఇండియా టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీ బుధవారం సెమీస్ దశకు చేరింది. బాలుర విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో ఆదిషాపమా(తమిళనాడు)పై జయాన్ మహ్మద్(తెలంగాణ) విజయం సాఽధించగా, సత్యక్రిష్(ఏపీ)పై ఆర్జున్‌దూ(హిమాచల్‌ప్రదేశ్), రేవంత్‌రిషి(ఏపీ)పై ష్టోక్ అల్‌నాడ్(మహారాష్ట్ర), వినాయకరెడ్డి(తెలంగాణ)పై జోయల్ జాన్సన్(తమిళనాడు) విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించారు. అలాగే, బాలికల క్వార్టర్ ఫైనల్స్‌లో త్రిషాసాహూ(ఒడిషా)పై అలీజా సిమ్రా(తెలంగాణ), ధత్రి(హార్మానా)పై కుషి విశ్వరంభరామ(తెలంగాణ), కుందనప్రియ(తెలంగాణ)పై కనిష్క గోవింద్(తమిళనాడు), వరఅనూహ(తెలంగాణ)పై కాష్వి కొనలు(కర్ణాటక గెలిచి సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నారు.
బీఎల్‌ఓలు ఓటు రక్షకులుగా వ్యవహరించాలి
ఖమ్మంమయూరిసెంటర్: ‘ఓట్ బచావో – దేశ్ బచావో’లో భాగంగా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ) అర్హుల ఓటు హక్కు కాపాడేందుకు పాటుపడాలని ఏఐసీసీ కార్యదర్శి వేగి వెంకటేష్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు సూచించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో బుధవారం జిల్లా, నగర అధ్యక్షులు నూతి సత్యనారాయణగౌడ్, నాగండ్ల దీపక్‌చౌదరితో కలిసి బీఎల్‌ఏలతో సమావేశమై సూచనలు చేశారు. ఈనెల 26న హైదరాబాద్‌లో నిర్వహించే రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి పార్టీ శ్రేణులు తరలిరావాలని వెంకటేష్, శ్రీను కోరారు. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ, మార్కెట్ చైర్మన్లు మహ్మద్ ఖాదర్ బాబా, యరగర్ల హన్మంతరావు, నాయకులు చక్కిలం రాజేశ్వరరావు, కమర్తపు మురళి, దొబ్బల సౌజన్య, మొక్క శేఖర్‌గౌడ్, పుచ్చకాయల వీరభద్రం, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
రేపు టీటీడీసీ భవన్‌లో జాబ్‌మేళా
ఖమ్మం మయూరిసెంటర్(ఖమ్మం రాపర్తినగర్): నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 20వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి ఎన్.మాధవి తెలిపారు. హైదరాబాద్‌లోని రోషన్ టెక్నాలజీ, ఎలక్ట్రో సర్క్యూట్ సిస్టమ్స్‌లో ఉద్యోగాల కోసం ఐటీఐ, డిగ్రీ, బీటెక్ చదివిన వారు అర్హులన్నారు. ఈమేరకు 18–30 ఏళ్ల వయస్సు కలిగిన వారు శుక్రవారం ఉదయం 10గంటలకు ఖమ్మం టీటీడీసీ భవన్‌లో మొదలయ్యే ఇంటర్వ్యూలకు సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు.


