ఖమ్మంమయూరిసెంటర్: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్‌యూ) జిల్లా నూతన కమిటీని 13మంది సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జిల్లా నిర్మాణ జనరల్ బాడీ కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా తిమ్మిడి రఘు(పాలేరు), ప్రధాన కార్యదర్శిగా తిప్పారపు లక్ష్మణ్(ఖమ్మం) ఎన్నికయ్యారని రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ శుక్రవారం తెలిపారు. అలాగే, ఉపాధ్యక్షుడిగా గంటా మనోహర్, సహాయ కార్యదర్శిగా పాండవుల సుశాంత్, కోశాధికారిగా బానోత్ స్టాలిన్, కార్యవర్గ సభ్యులుగా కార్తీక్, గణేష్, వెంకటేష్, సిద్ధుతో పాటు మరో నలుగురిని కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు రఘు, లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం తీరుతో పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు హామీల అమలు, సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని తెలిపారు. కాగా, ‘ఇంటర్ విద్య రద్దు – పరిణామాలు, విద్యారంగంపై ప్రభావం’ అంశంపై శనివారం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సమావేశానికి విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యావేత్తలు హాజరుకావాలని కోరారు.


