నేలకొండపల్లి: మండలంలోని సింగారెడ్డిపాలెం(అనంతనగర్) సమీ పాన మూసిఉన్న ఓ పాఠశాల వద్ద గుర్తుతెలియని వృద్ధుడి(65) మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గుర్తించారు. పాఠశాలలోని మరుగుదొడ్లలో వృద్ధుడు చనిపోయి ఉండగా, స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్సై పి. శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. వృద్ధుడిని ఎవరైనా కావాలని తీసుకొచ్చి వదిలేశారా, లేక యాచకుడు ఆశ్రయం తీసుకుంటూ మృతిచెందాడా అన్న కోణంలో వివరాలు ఆరా తీశారు. కాగా, సదరు వృద్ధుడు మృతిచెంది వారం కావొచ్చని తెలిసింది. సదరు వ్యక్తి ఆచూకీ తెలిని వారు కూసుమంచి సీఐ లేదా నేలకొండపల్లి పోలీసుస్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచించారు.
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
కుమార్తె పెళ్లి జరిగిన వారానికి విషాదం
సత్తుపల్లిటౌన్: పెళ్లింట విషాదం అలముకుంది. కుమార్తె పెళ్లి చేసిన వారం రోజులకే తండ్రి చెరువులో గల్లంతై మృతి చెందాడు. సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన తడికమళ్ల చంద్రయ్య ( 52) పశువులను మేపుతూ వెళ్లి గురువారం చెరువులో గల్లంతైన విషయం విదితమే. గజ ఈతగాళ్ల సాయంతో శుక్రవారం గాలించగా ఆయన మృతదేహం బయటపడింది. కాగా, చంద్రయ్య పెద్ద కుమార్తె వివాహం గత శుక్రవారం జరిగింది. వారంలోనే చంద్రయ్య మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది.
కాలేజీ సిబ్బంది వేధింపులతోనే ఆత్మహత్య
చింతకాని: మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని గుంటి దీపిక(18) గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఆమె ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ మహిళా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాల సిబ్బంది వేధింపులు తట్టుకోలేక వేదనకు గురైన తమ కూతురు ఇంటికి వచ్చి ఆత్మహత్యకు చేసుకుందని దీపిక తండ్రి అంజయ్య ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు.
చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్
రూ.40 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం
హస్తినాపురం: ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న నిందితుడితో పాటు చోరీ సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు నిందితుల నుంచి రూ.40లక్షల విలువైన 360 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోగా, వనస్థలిపురం ఏసీపీ పల్లె కాశిరెడ్డి శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఈనెల 22న కమలానగర్‌లో మండలిక సాయి సత్యనారాయణమూర్తి ఇంటికి తాళం వేసి ఆస్పత్రిలో ఉన్న భార్య వద్దకు వెళ్లి మరుసటి రోజు వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోపల పరిశీలించగా 360 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు విచారణలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన బాతుల రవీందర్‌ను నిందితుడిగా గుర్తించారు. ఆయన మేడ్చల్ జిల్లా నారపల్లి శ్రీరామ్‌నగర్‌కాలనీలో ఉంటూ పగటిపూట కాలనీల్లో తిరిగి తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రి చోరీ చేసేవాడని తేలింది. ఆయన నుంచి నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గాంధీనగర్ వాసి, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ఉండే క్యాబ్ డ్రైవర్ నేనావత్ కృష్ణ చోరీ సొత్తు కొనుగోలు చేసినట్లు గుర్తించి 360 గ్రాముల ఆభరణాలు స్వాధీనం చేసుకుననట్లు ఏసీపీ కాశిరెడ్డి తెలిపారు. కాగా, చోరీ చేసిన రవీందర్‌పై గతంలో మేడిపల్లి, పోచారం, చిట్యాల, ఘట్‌కేసర్, ఖమ్మం, విజయవాడ తదితర ప్రాంతాల్లో నమోదు కాగా, కృష్ణపై కూడా మీర్‌పేట, కరీంనగర్ స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నాయని వెల్లడించారు.


