కల్లూరురూరల్: కల్లూరు మండలంలోని ముగ్గువెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న 21 మహిళా సంఘాలకు ఇచ్చిన సీ్త్ర నిధుల్లో అవకతవకలు జరిగాయనే విమర్శలు వచ్చాయి. ఈమేరకు గురువారం ఐకేపీ అసిస్టెంట్ మేనేజర్ గోపాలాచారి ఆధ్వర్యాన విచారణ చేపట్టారు. గ్రామంలోని 21 సంఘాల సభ్యులు 78 మందికి 2019లో రూ.44,96,890 రుణం మంజూరైంది. ఇందులో కొందరు నాలుగేళ్ల నుంచి సరిగ్గా చెల్లించకపోగా, ఇంకొందరు సభ్యులు చెల్లించిన రూ.53.64 లక్షల్లో రూ.34.84 లక్షలే ఖాతాలో జమ అయినట్లు తేలింది. అప్పటి వీఓఏ కె.జయలక్ష్మి, గ్రామ సంఘం అధ్యక్షురాలు ఎం.ప్రశాంతి, సీసీ కె.వెంకయ్య దీనికి బాధ్యులని సభ్యులు ఆరోపించారు. కాగా, పక్కదారి పట్టిన రూ.18.79లక్షలపై స్పష్టత వస్తే తాము చెల్లించా ల్సిన రూ.13.72 లక్షలు కడతామని సభ్యులు స్పష్టం చేశారు. ఈ విచారణలో సర్పంచ్ వడ్లమూడి బేబీ స్వరాజ్యలక్ష్మి తో పాటు గ్రామస్తులు భూమి, మీనా, వడ్లమూడి నానాజీ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న జయలక్ష్మి అందుబాటులో లేకపోవడంతో సోమవారం మరోసారి విచారణ చేపడతామని అధికారులు తెలిపారు.


