సెప్టెంబర్‌లోనే 72 కేసుల నమోదు
కట్టడిపై దృష్టి సారించని
వైద్య, ఆరోగ్య శాఖ
డెంగీ కేసులు 102
జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలతో పాటు డెంగీ కేసులు భయపెడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 102 డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా సెప్టెంబర్‌లోనే 72 కేసులు వెలుగు చూడటం గమనార్హం. జూన్‌లో రెండు, జూలైలో ఆరు, ఆగస్టులో 19 పాజిటివ్ కేసులు నమోదవగా, సెప్టెంబర్‌లో ఒకేసారి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మంచుకొండ, ఖమ్మంలోని నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో పదుల సంఖ్యలో డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక కల్లూరు, తల్లాడ, ఎం.వీ.పాలెం, కూసుమంచి, పెద్దగోపతి, సుబ్లేడు, మాటూరిపేట తదితర పీహెచ్‌సీల పరిధిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే, పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించక క్షేత్రస్థాయిలో పరిస్థితులు బయటకు రావడం లేదు. జిల్లాలో ఇంటికొకరు జ్వరంతో బాధపడుతున్నా వైద్య, ఆరోగ్య శాఖ కంటితుడుపు చర్యలకే పరిమితమవుతుందనే విమర్శలు వస్తున్నాయి. దోమల నివారణకు ఫాగింగ్, కాల్వల్లో మందు పిచికారీ, లార్వా ఎదగకుండా ఆయిల్ బాల్స్ వదలడం మరిచిపోగా... ప్రజలు డెంగీ, విషజ్వరాల బారిన పడకుండా అవగాహన కల్పించపోవడంతో వ్యాధులు క్రమంగా పెరుగుతున్నాయి.
విషజ్వరాలు.. లెక్కే లేదు
జిల్లా వ్యాప్తంగా ప్రజలు విషజ్వరాలతో నానాయాతన పడుతున్నారు. ఈ నాలుగు నెలల్లో 29 వేల మంది విషజ్వరాల బారిన పడ్డారు. అయితే, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారి సంఖ్య కాగా, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందిన వారి వివరాలు వెల్లడయ్యే అవకాశం లేదు. వైరల్ ఫీవర్‌తో పాటు డెంగీ కేసులు నమోదవుతున్నా వైద్య ఆరోగ్య శాఖ వద్ద కనీసం గణాంకాలు నమోదులోనూ నిర్లిప్తంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. ఉన్నతాధికారుల నుంచి అపవాదు రావొద్దనే భావనతోనే తక్కువ కేసులు చూపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. జ్వర సర్వే పేరుతో నామమాత్రంగా సేవలు అందిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నా విషజ్వరాలు, డెంగీపై ప్రజలకు ఏ మాత్రం అవగాహన కల్పిండం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఆస్పత్రులపై నిఘా కొరవడి డెంగీ, విషజ్వరాల పేరుతో యాజమాన్యాలు అమాయక ప్రజల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాయి. ఇకనైనా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు జ్వరాల కట్టడికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలనే సూచనలు వస్తున్నాయి.
ఈ సీజన్‌లో డెంగీ, విషజ్వరాల గణాంకాలు
జిల్లాలో నూరు దాటిన
డెంగీ కేసులు


