భద్రాచలం: పోలీసు ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధమవుతున్న గిరిజన విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 100 మందికి అవకాశం ఉంటుందని, ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ అందించి, అవగాహన పరీక్షలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలు దాటని వారు దరఖాస్తు చేసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అందులో ప్రతిభ, ఇంటర్, డిగ్రీ మార్కులు ప్రాతిపదికన ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 7లోగా ఐటీడీఏ ప్రాంగణంలోని డీడీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అభ్యర్థులకు 10వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, 12న ఫలితాలు వెల్లడించి సర్టిఫికెట్లు పరిశీలించాక 15నుంచి శిక్షణ ప్రారంభిస్తామని, వివరాలకు 89784 77345 నంబర్‌లో సంప్రదించాలని పీఓ సూచించారు.
క్లినికల్ శిక్షణకు దరఖాస్తులు
ఖమ్మం సహకారనగర్: ఇంటర్ ఎంఎల్‌టీ ఒకేషనల్ కోర్సులో మార్చి 2024 నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులకు ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో క్లినికల్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవి బాబు తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకుని ఎంపిక కాని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు బయోడేటా ఫారంతో పాటు రూ.10 పోస్టల్ స్టాంప్ అతికించిన సొంత చిరునామా కవర్, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు జతపరిచి కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో ఈనెల 15లోగా అందించాలని సూచించారు. శిక్షణకు ఎంపికై న వారు రూ.వెయ్యి డీడీ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
అటవీ శిక్షణలో మూడు బంగారు పతకాలు
చుంచుపల్లి: దూలపల్లిలోని అటవీ అకాడమీలో ఆరు నెలల పాటు నిర్వహించిన ప్రవేశ శిక్షణను జిల్లా నుంచి ఆరుగురు అటవీ క్షేత్ర అధికారులు పూర్తి చేశారు. ఈమేరకు 39వ బ్యాచ్‌లో 100 మంది అభ్యర్థులకు గాను జిల్లా నుంచి ఆరుగురు పాల్గొనగా, ఇందులో బి.మోనికా నాయక్ ప్రథమ స్థానాన నిలిచి మూడు బంగారు పతకాలు సాధించారు. ఆమెతో శిక్షణ పూర్తి చేసిన టి.జ్యోత్స్న, ఈ.కవిత, ఎస్.నందిని, బి.అనిత, కె.కార్తీక్‌ను గురువారం జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్‌సింగ్ అభినందించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను అటవీ, వన్యప్రాణుల సంరక్షణలో సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
బొగ్గు ఉత్పత్తి, నాణ్యతపై ప్రధాన దృష్టి
సత్తుపల్లి: లక్ష్యం మేర బొగ్గు ఉత్పత్తి చేయడంతో పాటు నాణ్యతపై ప్రధాన దృష్టి సారించాలని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ – ప్రాజెక్ట్స్) కె.వెంకటేశ్వర్లు సూచించారు. సత్తుపల్లి ఏరియాలో గురువారం పర్యటించిన ఆయన ఓసీల్లో బొగ్గు, వెలికితీతపై ఆరా తీశారు. జేవీఆర్ ఓసీ–2లో ఉత్పత్తి పురోగతి, సీహెచ్‌పీ ద్వారా బొగ్గు రవాణా, ప్రతిపాదిత జేవీఆర్ ఓసీ–3 సరిహద్దులు, విస్తరణ అవకాశాలపై అధికారులతో సమీక్షించారు. అలాగే, ప్రతిపాదిత ఓసీ–3 ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎస్.వెంకటాచారి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
12వ తేదీ వరకు
ప్రవేశాలకు అవకాశం
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్ చదివేందుకు ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ కూరపాటి మంగపతిరావు తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


