పదవా.. సేవా ?! | - | Sakshi
Sakshi News home page

పదవా.. సేవా ?!

Oct 2 2026 12:22 AM | Updated on Oct 2 2026 12:22 AM

● రెడ్‌క్రాస్‌లో 2,430 మంది సభ్యులు ● ఈనెల 4న జిల్లా కమిటీ ఎన్నికలు ● కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ సభ్యత్వాలు ఉండడంపై చర్చ

● రెడ్‌క్రాస్‌లో 2,430 మంది సభ్యులు ● ఈనెల 4న జిల్లా కమిటీ ఎన్నికలు ● కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ సభ్యత్వాలు ఉండడంపై చర్చ

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సేవా కార్యక్రమాల నిర్వహణ, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో ఏర్పడిన ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ(ఐఆర్‌సీఎస్‌)కి జిల్లాలో మొదటిసారి ఎన్నికలు జరగనున్నాయి. ఇన్నాళ్లు జిల్లా కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నికవుతుండగా, ఈసారి పోటీ ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈక్రమాన ఓటర్ల జాబితా అనుమానాలకు తావిస్తోంది. కొన్ని ప్రాంతాల నుంచే అత్యధిక సభ్యత్వాలు ఉండడం ఇందుకు కారణమవుతోంది. పదవులపై మక్కువతోనే కొందరు సభ్యత్వం తీసుకుని, ఇంకొందరికి ఇప్పించారని తెలుస్తోంది.

సేవే పరమావధిగా..

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రధానంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఏర్పడగా.. జిల్లాలో 2010 నుంచి కార్యకలాపాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలు కాపాడటం, ప్రాథమిక చికిత్స, ప్రమాదాల నివారణకు చర్యలు, రక్తదాన శిబిరాల నిర్వహణ, వరదలు, అగ్నిప్రమాదాలు వంటి విపత్తుల సమయాన బాధితులకు అండగా నిలుస్తోంది. పీహెచ్‌సీల నిర్వహణ, తాగునీరు పరిశుభ్రంగా ఉండేలా అవగాహన, వైద్య శిబిరాల ఏర్పాటు, నర్సులకు శిక్షణ తదితర కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఆ ప్రాంతాల నుంచి ఎక్కువగా..

రెడ్‌క్రాస్‌లో సభ్యత్వానికి 18ఏళ్లు నిండి భారతీయులైతే సరిపోతుంది. లైఫ్‌ మెంబర్‌షిప్‌కు రూ.వేయి, లైఫ్‌ అసోసియేట్‌ మెంబర్‌షిప్‌కు రూ.250 చెల్లించాలి. కొత్త నిబంధనల ప్రకారం లైఫ్‌ మెంబర్‌షిప్‌, లైఫ్‌ అసోసియేట్‌ సభ్యులకు ఓటు హక్కు కల్పించారు. ఆన్‌లైన్‌లోనూ నమోదుకు అవకాశముండగా, జిల్లాలో 2,430 మంది సభ్యత్వాలు తీసుకున్నారు. కాగా, సభ్యులు తప్పక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనే నిబంధన లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లోనే అత్యధిక సభ్యత్వాలు నమోదయ్యాయి. ప్రధానంగా తల్లాడ మండలం మల్సూర్‌ తండాలో 152 మంది చేరారు. కల్లూరులోని హనుమతండాలో 67 మంది, ఖమ్మం అర్బన్‌ మండలంలో 29 మంది, కల్లూరు మండలం లక్ష్మీపురంలో 26 మంది, కొణిజర్ల మండలం రాజ్యతండాలో 24 మంది సభ్యత్వం తీసుకున్నారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు ఆశిస్తున్న వారే ఇలా సభ్యత్వాలు చేయించారనే ప్రచారం జరుగుతోంది. ఉన్నత లక్ష్యాలతో ఏర్పడిన రెడ్‌క్రాస్‌లో అధికారం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

సేవా కార్యక్రమాలకు నగదు..

రెడ్‌క్రాస్‌లో సభ్యత్వం తీసుకున్న అందరూ తప్పనిసరి క్షేత్రస్థాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనే నిబంధన లేదు. వీరు చెల్లించే సభ్యత్వ రుసుము సంస్థ చేపట్టే కార్యక్రమాలకు ఉపయోగపడుతుందనే భావనతో పాల్గొనే అంశంలో సడలింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, రెడ్‌క్రాస్‌ జిల్లా మేనేజింగ్‌ కమిటీలో స్థానానికి 39మంది పోటీ పడుతుండగా, 15మందిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు ఈనెల 4వ తేదీన ఉదయం 8నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement