● 40 శాతం నీరు ఉన్న జలాశయాల్లో విడుదల ● ఉమ్మడి జిల్లాలో 1,255 చెరువుల గుర్తింపు
ఖమ్మంవ్యవసాయం/పాల్వంచ రూరల్: మత్స్యకారుల ఉపాధి కోసం రూపొందించిన చేప పిల్లల పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ఎల్‌నినో నేపథ్యాన వర్షాలు లేక ఈ ఏడాది జలాశయాల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. దీంతో జలవనరుల శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా 40శాతం నీరు ఉన్న జలాశయాల్లో చేప పిల్లలు వదలాలని నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలోని 882 జలాశయాల్లో రూ.4.60 కోట్ల విలువైన 3.47 కోట్ల చేపపిల్లల వదలాలని తొలుత ప్రతిపాదించారు. కానీ జిల్లాలో 40 శాతానికి పైగా 650 జలాశయాల్లోనే నీరు ఉందని జల వనరుల శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో ఆయా చెరువుల్లోనే చేపపిల్లలు వదలనున్నాయి. పెద్ద చేపపిల్ల(80–100 మి.మీ) రూ. 1.64, చిన్న చేప పిల్ల (35–40 మి.మీ)కు రూ.66 పైసల చొప్పున ధర నిర్ణయించగా, ఈనెల 5వ తేదీ సోమవారం నుంచి పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
భద్రాద్రి జిల్లాలో 605 చెరువులు
భద్రాద్రి జిల్లాలోని 605 చెరువుల్లో సరిపడా నీరు ఉన్నట్టు అందిన నివేదికతో మత్స్యశాఖ అధికారులు చేపపిల్లల పంపిణీకి సిద్ధమయ్యారు. రెండు, మూడు రోజుల్లో కార్యక్రమం ప్రారంభిస్తామని జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు. మొత్తం 763 చెరువుల్లో 1.20కోట్ల చేపపిల్లలు వదలాలని ప్రతిపాదించినా నీటి లభ్యత లేక చివరకు 88 లక్షలకు పరిమితమయ్యారు. వీటిలో 80 – 100 మి.మీ. సైజు పిల్లలు 40లక్షలు, 35 – 40 మి.మీ. సైజు కలిగినవి 40లక్షల చేపపిల్లలను విడుదల చేయనున్నారు. కాగా, మార్కెట్‌లో డిమాండ్ దృష్ట్యా ఈ ఏడాది రవ్వ, మోసుతో పాటు బంగారు తీగ రకం చేపపిల్లలు కూడా విడుదల చేస్తారు.


