● వార్డెన్లు హాస్టళ్లలో ఉండకపోతే సస్పెన్షన్ వేటు ● సమీక్షలో కలెక్టర్ దివాకర టీ.ఎస్.
ఖమ్మంమయూరిసెంటర్: గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, విద్యార్థులకు చదువు, వసతి, భోజనం, మౌలిక వసతుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక విభాగం పర్యవేక్షిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వార్డెన్లు హాస్టల్‌లో ఉంటే 90 శాతం సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ఆకస్మిక తనిఖీల సమయాన వార్డెన్ విధుల్లో లేకపోతే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించకపోతే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతీనెల స్థానిక సంస్థల సిబ్బందితో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలని, నాణ్యత లేని వంట సరుకులు, వంట ప్రదేశం, పాత్రలపై దృష్టి సారించాలని చెప్పారు. ప్రహరీల నిర్మాణంపై ప్రతిపాదనలు సమర్పిస్తే ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేయిస్తామని తెలిపారు.
క్రిమినల్ కేసులు నమోదు..
రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో లైంగిక వేధింపులకు సంబంధించిన ఏ ఘటన జరిగినా కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన సందర్భాల్లో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇలాంటి ఘటనలను దాచిపెట్టకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని క్రమం తప్పకు పర్యవేక్షించాలని సూచించిన కలెక్టర్ యూనిఫామ్ పంపిణీపై ఆరా తీశారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడగా ఎస్సీ, బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు జి.జ్యోతి, ముజాహిద్, ఫిరంగి తదితరులు పాల్గొన్నారు.


