ఖమ్మంక్రైం/ఖమ్మం అర్బన్: ఇటీవల జిల్లాలో సీఐల బదిలీ చేపట్టగా, అధికారులు నూతన స్థానాల్లో విధుల్లో చేరుతున్నారు. ఇందులో భాగంగా గురువారం ఖమ్మం అర్బన్, టూ టౌన్, ఖమ్మం ట్రాఫిక్ సీఐలు నాగరాజు, జె.రామకృష్ణ, శివప్రసాద్ స్టేషన్లలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో సమావేశమై పెండింగ్ కేసులు, విచారణపై సమీక్షించారు. అనంతరం వారు పోలీసు కమిషనర్ సునీల్‌దత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈమేరకు ఆయన బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కేసుల విచారణ వేగం పెంచాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
పీఎం సూర్యఘర్ కౌంటర్లు ప్రారంభం
● రేపటి వరకు స్పాట్ రిజిస్ట్రేషన్లు
ఖమ్మంవ్యవసాయం: పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద జిల్లాలో సేవా – సేతు కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. గృహస్తులు తమ ఇళ్లపై సౌర విద్యుత్ ప్లాంట్లను ప్రభుత్వ సబ్సిడీతో ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా విద్యుత్ శాఖ ఆధ్వర్యాన అన్ని డివిజన్ కార్యాలయాల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లలో 3వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించారు. ఈమేరకు 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్ల వరకు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటే రూ.78 వేల వరకు రాయితీ లభిస్తుందని వివరించారు. సొంతానికి వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను డిస్కంకు ఇస్తే అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. ఈమేరకు ఖమ్మం సర్కిల్ కార్యాలయంలో సదస్సులో ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్ మధుసూదన్ మాట్లాడుతూ సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని సూచించారు. ఎస్‌ఈ ఇనగుర్తి శ్రీనివాసచారి, డీఈ రామారావు, రెడ్‌కో మేనేజర్ అజయ్ కుమార్, ఏడీఈ యాదగిరి, ఉద్యోగులు పాల్గొన్నారు.
సబ్‌స్టేషన్ తనిఖీ చేసిన డైరెక్టర్
కొణిజర్ల: మండలంలోని పెద్దగోపతి సబ్ స్టేషన్‌ను ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్ నిర్వహణ, సరఫరాపై సూచనలు చేశారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ కృష్ణ, డీఈ రమేష్, ఏడీఈ రామకృష్ణ, ఏఈ భరత్ తదితరులు పాల్గొన్నారు.


