జూలూరుపాడు: మిర్చి, వరి, పత్తిలో తెగుళ్లు వ్యాపిస్తున్నందున రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ టి.భరత్ సూచించా రు. జూలూరుపాడు మండలం కరివారిగూడెంలో పలువురు రైతుల పంటలను బుధవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. వరిలో బ్యాక్టీరియల్ లీఫ్ బ్‌లైట్(బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు), పత్తిలో రసం పీల్చే పురుగుల ఉధృతి, మిరపలో వేరుకుళ్లు తెగులు సోకుతోందని తెలిపారు. ఈమేరకు సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. మిర్చిలో చీడపీడల గుర్తింపు, నియంత్రణకు పసుపు, నీలి రంగు స్టిక్కీ ట్రాప్ ల ప్రాముఖ్యత, ఏర్పాటు చేసే విధానాన్ని వివరించారు. కరివారిగూడెం సర్పంచ్ బోడా దుర్గా, ఏఈఓ జి.సరిత, రైతులు పాల్గొన్నారు.


