ప్రభుత్వం నుంచి ఆదేశాలు..
ఈ విధానం సరికాదు..
● నేటి నుంచి ఎస్‌ఏ–1 పరీక్షలు ● మార్పులపై ఉపాధ్యాయుల్లో అసంతృప్తి
కొణిజర్ల: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పరీక్షించే సమ్మేటివ్ అసెస్‌మెంట్ –1 పరీక్షలు గురువారం మొదలుకానున్నాయి. విద్యా సంవత్సరం మొదలైన జూన్ నుంచి సెప్టెంబర్ వరకు బోధించిన విషయాలను విద్యార్థులు ఏ మేర అర్థం చేసుకున్నారో ఈ పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులను గురువారం మొదలయ్యే పరీక్షలు ఈనెల 9వరకు జరుగుతాయి. ఇక 6, 7వ తరగతులవారికి 1 నుంచి 8వ తేదీ వరకు, 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు 9వరకు పరీక్షలు కొనసాగుతాయి.
అమల్లోకి కొత్త విధానం
జవాబుపత్రాల మూల్యాంకనం పారదర్శకంగా జరగాలనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎస్‌ఏ –1 నుంచి జంబ్లింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ఎంఈఓలకు విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి. ఇన్నాళ్లు ఎక్కడికక్కడ పాఠశాలల ఉపాధ్యాయులే జవాబుపత్రాలు దిద్ది మార్కులు కేటాయించేవారు. కొత్త విధానంలో అన్ని పాఠశాలల జవాబు పత్రాలను ఎమ్మార్సీకి తరలించి అక్కడే దిద్దించి మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయిస్తారు. పరీక్ష ముగియగానే జవాబుపత్రాలను హెచ్‌ఎంలు ఎంఆర్‌సీ(ఎంఈఓ కార్యాలయం)లో అందజేయాలి. పరీక్ష పూర్తయిన మరుసటి రోజు నుంచే మూల్యాంకనం మొదలుపెట్టాల్సి ఉంటుంది.
భిన్నాభిప్రాయాలు
కొత్తగా అమలుచేయనున్న జంబ్లింగ్ విధానాన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పలువురు ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. ఇది ఉపాధ్యాయుల పనితీరును అవమానించినట్టే అవుతుందని చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మార్కులు నిష్పక్షపాతంగా కేటాయించడం ద్వారా విద్యార్థుల సామర్థ్యాలు తెలుస్తాయని.. తద్వారా బోధనలో మార్పులు చేయొచ్చని చెబుతోంది. అయితే, క్షేత్రస్థాయిలో జంబ్లింగ్ మూల్యాంకనం సాఫీగా సాగుతుందా అన్న సందేహం నెలకొంది. కాగా, మూల్యాంకకానికి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయలకు పేపర్‌కు రూ2, హైస్కూల్ టీచర్లకు పేపర్‌కు రూ.3చొప్పున పారితోషికం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఎంఈఓ ఖాతాల్లో రూ.10వేల చొప్పున జమ చేశారు. అంతేకాక మండలాల వారీగా సబ్జెక్ట్ నిపుణుల జాబితా సేకరించారు. కాగా, కొణిజర్ల మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కలిపి 6,342 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2,838 మంది, గురుకులాలు ఆశ్రమ పాఠశాలల్లో 1,243 మంది, ప్రైవేట్ పాఠశాలల నుంచి 2,261 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో 1–5 తరగతుల విద్యార్థులకు యాజమాన్యాలు సొంతంగా ప్రశ్నపత్రాలు సమకూర్చుకునే వెసులుబాటు ఉంది. అయితే, 6–10 తరగతుల విద్యార్థులకు మాత్రం ప్రభుత్వం పంపిణీ చేసిన ప్రశ్నాపత్రాలతోనే పరీక్షలు నిర్వహించాలి.
ఎస్‌ఏ –1 జవాబుపత్రాల మూల్యాంకనం జంబ్లింగ్ విధానంలో చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే సబ్జెక్ట్ నిపుణులను ఎంపిక చేశాం. పరీక్ష పూర్తవగానే జవాబుపత్రాలను ఎంఆర్‌సీకి చేర్చి వారితో మూల్యాంకనం చేయిస్తాము.
– దొడ్డిగర్ల అబ్రహం,
ఎంఈఓ కొణిజర్ల
నిరంతర మూల్యాంకనం స్థానంలో బాహ్య మూల్యాంకనం అనేది సరికాదు. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా ఉపాధ్యాయులు మార్కులు ఇస్తుంటారు. విద్యావ్యవస్థ లక్ష్యాలు, విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసేలా ఉన్న కొత్త విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. – షేక్ కరామత్ అలీ,
జిల్లా అధ్యక్షుడు, ఎస్‌టీయూ – టీఎస్


