రవాణా శాఖ కార్యకలాపాలపై ఆర్‌టీఓ ఆరా | - | Sakshi
Sakshi News home page

రవాణా శాఖ కార్యకలాపాలపై ఆర్‌టీఓ ఆరా

Oct 1 2026 12:41 AM | Updated on Oct 1 2026 12:41 AM

ఖమ్మంక్రైం: ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో ఉద్యోగుల విధులు, వాహనాల రిజిస్ట్రేషన్లను జిల్లా రవాణాశాఖాధికారి జగదీష్‌ బుధవారం తనిఖీ చేశారు. తొలుత మినిస్టీరియల్‌ ఉద్యోగుల పనితీరును పరిశీలించిన ఆయన వాహనదారులకు పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశించారు. ఆ తర్వాత లెర్నింగ్‌, పర్మనెంట్‌ లైసెన్స్‌ల జారీ, వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలు, రిజిస్ట్రేషన్లను పరిశీలించి సూచనలు చేశారు. కార్యాలయంలోకి ఏజెంట్లను అనుమతించకుండా, వాహనదారులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ఎంవీఐ శ్రీనివాసరావు, ఏఎంవీఐలు దినేష్‌, రవిచందర్‌, రాంబాబు పాల్గొన్నారు.

రక్తదాతలను

ప్రోత్సహించాలి

ఖమ్మం వైద్యవిభాగం: జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవంపై విస్తృత అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ రామారావు సూచించారు. ఖమ్మంలోని మామిళ్లగూడెం అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్‌, ఓపీ రికార్డులు, ల్యాబ్‌లో పరీక్షలను పరిశీలించారు. గర్భిణుల రిజిస్ట్రేషన్‌ శాతాన్ని మరింతగా పెంచాలని ఆదేశించారు. అలాగే, కేన్సర్‌ వ్యాధి లక్షణాలు, ముందస్తు గుర్తింపు, నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని శిబిరాలు ఏర్పాటుచేసిన రక్తదాతలను ప్రోత్సహించాలని తెలిపారు. వైద్యాధికారులు కృష్ణచైతన్య, శ్రావ్య, ఉద్యోగులు సంధ్యారాణి, నాగమ్మ, పి.లక్ష్మి, నాగలక్ష్మి, రాజేశ్వరి, హేమలత, దయామణి, నాగరాణి, చంద్రమణి, భవాని పాల్గొన్నారు.

కొత్తగా 30 విజయ పాల సహకార సంఘాలు

ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి జిల్లాల్లో పాడి పరిశ్రమాభివృద్ధికి అన్ని చర్యలు చేపడుతున్నామని విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్‌ కె.రవికుమార్‌ తెలిపారు. ఈమేరకు కొత్తగా ఉమ్మడి జిల్లాలో 30 విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని బుధవారం వెల్లడించారు. ఈ సంఘాల నమోదు ప్రక్రియ ‘సహకార్‌‘ పోర్టల్‌లో జరుగుతోందని తెలిపారు. అలాగే, నాణ్యమైన పాల ఉత్పత్తి పెంచేలా పాడి రైతులు, ఉత్పత్తిదారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పశువుల కొనుగోలు కోసం రైతులకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, యూనియన్‌ బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వడంతో పాటు, అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ(ఏఐసీ) ద్వారా పశు బీమా కల్పిస్తున్నామని తెలిపారు. ఇందులో 85 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తే, లబ్ధిదారులు 15 శాతం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఆవుకు రూ.40వేల బీమా కాగా రూ.180, గేదెకు రూ.30వేల విలువైన బీమాలో రూ.133 చెల్లించాలని సూచించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మూడు దశల్లో 616 పశువులకు బీమా చేయించామని డీడీ వివరించారు.

సౌర విద్యుత్‌పై ‘సేవా–సేతు’ సదస్సులు

ఖమ్మంవ్యవసాయం: సోలార్‌ విద్యుత్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర నూతన పునరుద్ధరణీయ ఇంధన మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్పీడీసీఎల్‌, రెడ్‌కో సంయుక్తంగా ‘సేవా – సేతు’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా గురువారం నుంచి మూడు రోజుల పాటు అవగాహన కల్పించనున్నట్లు ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసచారి తెలిపారు. ఇంటిపై సోలార్‌ ఫలకాలు ఏర్పాటుకు ముందుకొస్తే స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ ఉంటుందని చెప్పారు. మూడు కిలోవాట్ల సౌర ఫలకాలకు రూ.78 వేల సబ్సిడీ అందుతుందని తెలిపారు. ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర, కూసుమంచి విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయాల ఆవరణలో జరిగే సదస్సుల్లో బ్యాంకర్లు, యూనిట్ల అమ్మకందారులు, అధికారులు పాల్గొననుండగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌ఈ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement