మరింత ఉధృతంగా రైతాంగ పోరాటాలు | - | Sakshi
Sakshi News home page

మరింత ఉధృతంగా రైతాంగ పోరాటాలు

Oct 1 2026 12:41 AM | Updated on Oct 1 2026 12:41 AM

ఖమ్మం మయూరిసెంటర్‌: దేశంలో రైతులు, కార్మిక హక్కుల పరిరక్షణ, భూ సమస్యల పరిష్కారానికి పోరాటాలను మరింత తీవ్రతరం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆశిష్‌ మిట్టల్‌ పిలుపునిచ్చారు. ఈక్రమాన సంఘాన్ని క్షేత్రస్థాయి నుంచి విస్తరించి బలమైన ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఏఐకేఎంఎస్‌ నాలుగో జాతీయ మహాసభల సందర్భంగా బుధవారం జరిగిన ప్రతినిధుల సభకు జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య, ఉపాధ్యక్షులు సుశాంత్‌, చలపతిరావు, రవీందర్‌ సింగ్‌ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నివేదిక ప్రవేశపెట్టిన ఆశిష్‌ మిట్టల్‌ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని బహుళజాతి సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక విధానాలపై సాగిన ఉద్యమాల్లో సంఘం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఢిల్లీ సరిహద్దులు, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో సాగిన పోరాటంలో చురుగ్గా పాల్గొని నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చామన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు బిహార్‌, ఒడిశా తదితర రాష్ట్రాల్లో భూమిలేని పేదలు, కౌలు రైతులు, దళితులు, ఆదివాసీల భూమి హక్కుల కోసం నిరంతరం పోరాటాలు సాగించామని వివరించారు. అటవీ భూముల ఆక్రమణ, ఖనిజ సంపద దోపిడీకి వ్యతిరేకంగా ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలో ఆదివాసీలను సమీకరించి పోరాటాలు నిర్మించినట్లు చెప్పారు. పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర , రుణ విముక్తి, గ్రామీణ పేదల జీవన భద్రతే ధ్యేయంగా భవిష్యత్‌ పోరాటాలు సాగుతాయని ఆయన తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచి కొత్త విధానాలను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈమేరకు ప్రతీ గ్రామంలో సంఘాన్ని నిర్మించి సభ్యత్వాలు పెంచాలని, మండల, జిల్లా స్థాయి కమిటీలను బలోపేతం చేయడం ద్వారానే రైతు, కూలీలు, కౌలు రైతులు, దళితుల సమస్యలపై నిరంతర పోరాటాలు సాగించవచ్చని తెలిపారు. ఈ సభలో తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఏఐకేఎంఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆశిష్‌ మిట్టల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement