ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే సంఘాల మధ్య పొత్తులు కొలిక్కి రావడమే కాక డమ్మీ బ్యాలెట్ పేపర్లను అధికారులు విడుదల చేయడంతో నాయకులు ప్రచారంలో వేగం పెంచారు. ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోలు, ఆర్‌ఎం కార్యాలయం పరిధి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
డమ్మీ బ్యాలెట్ పేపర్
ఆధారంగా..
ఎన్నికల సందర్భంగా అధికారులు డమ్మీ బ్యాలెట్ పేపర్లను ముద్రించి, కార్మిక సంఘాలకు అందజేశారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు కోసం క్లాజ్–3, రీజియన్ స్థాయి గుర్తింపుకు క్లాజ్–6 డమ్మీ బ్యాలెట్ పేపర్లు అందించారు. ఆయా బ్యాలెట్ పేపర్లపై ఉన్న గుర్తుల ఆధారంగా నాయకులు కార్మికులను కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు.
ప్రధాన సంఘాల మధ్య పొత్తు..
ఖమ్మం రీజియన్‌లో ఈసారి ప్రధాన సంఘాల మధ్య పొత్తులు కుదిరాయి. ఎస్‌డబ్ల్యూఎఫ్ – టీడబ్ల్యూయూ మధ్య పొత్తు కుదరగా.. టీఎంయూ నేత అశ్వథామరెడ్డి మద్దతు ప్రకటించారు. అంతేకాక కాంగ్రెస్‌కు చెందిన ఐఎన్‌టీయూసీ కూడా మద్దతు తెలిపింది. ఈనేపథ్యాన రీజియన్‌లో ఎస్‌డబ్ల్యూఎఫ్ నక్షత్రం గుర్తు, రాష్ట్ర స్థాయిలో బాణం గుర్తుతో తమ కూటమి విజయం సాధిస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఎంప్లాయీస్ యూనియన్ – నేషనల్ మజ్దూర్ యూనియన్ల మధ్య పొత్తు కుదిరింది. ఖమ్మం రీజియన్‌లో ఎన్‌ఎంయూ కాగడా, రాష్ట్ర స్థాయిలో ఈయూ బస్సు గుర్తుతో బరిలోకి దిగాయి. పొత్తులు కుదరడం, డమ్మీ బ్యాలెట్ పేపర్లు చేతికి రావడంతో ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే టీడబ్ల్యూయూ – ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమి తరఫున ఖమ్మంలో నిర్వహించిన సభకు అశ్వథామరెడ్డి, కూటమి ప్రధాన నేతలు హాజరయ్యారు. అటు ఈయూ – ఎన్‌ఎంయూ నేతలు సైతం డిపోల గేట్ల వద్ద, కార్యాలయాలు, గ్యారేజీల్లో ప్రచారం చేస్తూనే, కార్మికుల ఇళ్లకు వెళ్లి మరీ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.


