మామపై అల్లుడి గొడ్డలి దాడి | - | Sakshi
Sakshi News home page

మామపై అల్లుడి గొడ్డలి దాడి

Sep 27 2026 12:52 AM | Updated on Sep 27 2026 12:52 AM

చింతకాని: భార్యను కాపురానికి పంపడం లేదనే కక్షతో మామపై అల్లుడు గొడ్డలితో దాడి చేసిన ఘటన మండలంలోని లచ్చగూడెంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్‌ ఉద్దండు సాహెబ్‌ తన కుమార్తెను అదే గ్రామానికి చెందిన మేనల్లుడైన షేక్‌ నాగుల్‌మీరా ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే, నాగుల్‌మీరా దంపతుల నడుమ ఘర్షణతో భార్య ఇటీవల పుట్టింటికి వచ్చింది. అయితే, తిరిగి కాపురానికి పంపించాలని కోరగా గొడవ విషయమై ఉద్దండు సాహెబ్‌ ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన నాగుల్‌మీరా తన మామ ఇంటికి వెళ్లి గొడ్డలితో దాడి చేయగా గాయాలు కావడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు ఎస్సై నరేష్‌ వివరాలు ఆరా తీసి కేసు నమోదు చేశారు.

కొండముచ్చు దాడిలో తీవ్రగాయాలు

కల్లూరురూరల్‌: కల్లూరులో కొండముచ్చుల సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈక్రమాన శనివారం కల్లూరు మెయిన్‌ సెంటర్‌లోని షాపులో పనిచేస్తున్న క్రాంతిపై కొండముచ్చు దాడి చేయడంతో చేయికి తీవ్ర గాయాలయ్యాయి. గతవారం కూడా కొండముచ్చులు ముగ్గురిని గాయపరిచాయి. ఇకనైనా మున్సిపాలిటీ, అటవీ శాఖ సిబ్బంది స్పందించి కొండముచ్చులను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

రూ.96 లక్షలకు దివాలా పిటిషన్‌

ఖమ్మం లీగల్‌: ఖమ్మం వైఎస్సార్‌ కాలనీ చెందిన ప్రతిగడప రాజీవ్‌రాజు రూ.96.20లక్షలకు దివాళా పిటీషన్‌(ఐపీ) దాఖలు చేశారు. బంగారం ఫైనాన్స్‌ వ్యాపారం చేసే తనకు నష్టాలు వచ్చాయని చెబుతూ ఐదుగురిని ప్రతివాదులుగా చేర్చారు. ఈమేరకుశనివారం తన న్యాయవాది ద్వారా ఖమ్మం ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో దివాలా పిటిషన్‌ దాఖలు చేశాడు.

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

పెనుబల్లి: పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చాలని రెక్కలు ముక్కలు చేసుకుని కుమారుడు, కుమార్తెను చదివిస్తుండగా... విద్యుత్‌ షాక్‌ రూపంలో మృత్యువు కుమారుడిని బలి తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... పెనుబల్లి బీసీ కాలనీకి చెందిన తోట గౌతమ్‌(16) శనివారం రాత్రి ఇంట్లో స్నానం చేసేందుకు హీటర్‌ వైర్లు ఫ్లగ్‌లో పెడుతున్నాడు. ఈక్రమాన విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురైన ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించి ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పెనుబల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న గౌతమ్‌ తండ్రి నరసింహారావు రోజువారీ కూలీ కాగా, తల్లి సంధ్యారాణి కిరాణషాపులో పనిచేస్తోంది. ఇటీవల నరసింహారావుకు కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, నిర్మాణం పూర్తికాకున్నా అద్దె ఇంట్లో స్థోమత లేక నెల క్రితమే గృహ ప్రవేశం చేశారు. ఇంతలోనే కుమారుడు గౌతమ్‌ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు.

ద్విచక్రవాహనం ఢీకొని కార్మికుడు..

ఖమ్మంరూరల్‌: మండలంలోని గుర్రాలపాడు వద్ద ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో గ్రానైట్‌ కార్మికుడు వినోద్‌కుమార్‌(38) మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఔరంగాబాద్‌ నేతాపూర్‌కు చెందిన వినోద్‌కుమార్‌ గుర్రాలపాడు సమీపాన గ్రానైట్‌ ఫ్యాక్టరీలో పాలిష్‌ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన శనివారం రహదారి పక్క నుంచి వెళ్తుండగా తిరుమలాయపాలెంకు చెందిన కె.రాము బైక్‌పై అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన వినోద్‌ను ఖమ్మం తరలిస్తుండగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి..

ఖమ్మంక్రైం: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా తీవ్రగాయాలతో మృతి చెందాడు. ఖమ్మం టూటౌన్‌ సీఐ బాలకృష్ణ వెల్లడించిన వివరాలు... నేలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామానికి చెందిన చావా వెంకటేశ్వర్లు(60) స్వగ్రామం నుంచి భార్య కస్తూరిని శనివారం ద్విచక్రవాహనంపై ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకొస్తున్నాడు. ఈక్రమాన వైరా రోడ్డులో గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టగా వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయాలుకాగా, కస్తూరి సైతం గాయపడింది. దీంతో వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి వెంకటేశ్వర్లును ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈమేరకు హిట్‌ అండ్‌ రన్‌ కింద కేసు నమోదు చేసి వాహనాన్ని గుర్తించేందుకు సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నట్లు నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement