తూకంలోనే గోల్‌మాల్‌ | - | Sakshi
Sakshi News home page

తూకంలోనే గోల్‌మాల్‌

Sep 27 2026 12:52 AM | Updated on Sep 27 2026 12:52 AM

● తొలుత బరువు పెంచి, మధ్యలో ట్యాంకర్‌ నుంచి నూనె చోరీ ● నలుగురు అరెస్ట్‌.. పరారీలో 8మంది ● వివరాలు వెల్లడించిన ఖమ్మం ఏసీపీ రమణమూర్తి

● తొలుత బరువు పెంచి, మధ్యలో ట్యాంకర్‌ నుంచి నూనె చోరీ ● నలుగురు అరెస్ట్‌.. పరారీలో 8మంది ● వివరాలు వెల్లడించిన ఖమ్మం ఏసీపీ రమణమూర్తి

ఖమ్మంఅర్బన్‌: పామాయిల్‌ ట్యాంకర్‌ నుంచి నూనెను అక్రమంగా తీసి విక్రయిస్తున్న ముఠా గుట్టును ఖమ్మం పోలీసులు ఛేదించారు. ట్యాంకర్‌లో లోడ్‌ చేయక ముందు తూకానికి తీసుకెళ్లే సమయంలోనే అక్రమాలు మొదలవుతున్నాయని గుర్తించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయగా.. ఖమ్మం అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో నగర ఏసీపీ రమణమూర్తి శనివారం సీఐ భానుప్రకాశ్‌, ఎస్‌ఐ రాజారావుతో కలిసి వివరాలు వెల్లడించారు.

గోద్రెజ్‌ అగ్రోవెట్‌ కంపెనీ నుంచి..

ఏపీ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరంలోని గోద్రెజ్‌ అగ్రోవెట్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి ట్యాంకర్ల ద్వారా పంపిస్తున్న పామాయిల్‌ మధ్యలో చోరీ జరుగుతున్నట్లు కంపెనీ బాధ్యులు గుర్తించారు. ఈమేరకు మేనేజర్‌ వకలపూడి రామచంద్రరావు ఈనెల 23న ఖమ్మం అర్బన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ట్యాంకర్‌ డ్రైవర్‌ మరికొందరి కలిసి నూనె తీసి విక్రయిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు విచారణలో నిజమేనని తేలింది. ట్యాంకర్‌ యజమాని కమ్‌ డ్రైవర్‌ షేక్‌ కమరుద్దీన్‌ ట్యాంకర్‌ను వే బ్రిడ్జి వద్ద తూకానికి తీసుకెళ్లే సమయాన నీళ్ల బాటిళ్లు, రాళ్లు పెట్టి బరువు పెంచేవాడు. అనంతరం పామాయిల్‌ లోడ్‌ చేశాక వాటిని తొలగించి రవాణా సమయంలో పామాయిల్‌ను బయటకు తీసి ఇతరులకు విక్రయించేవాడు. ఈనెల 22న ఖమ్మం శివారులోని ఓ దాబా వద్ద ట్యాంకర్‌ను నిలిపి 31 కేన్లలో నూనె తీస్తుండగా విషయం బయటపడింది. ఈ వ్యవహారంలో కోదాడకు చెందిన ఆయిల్‌ వ్యాపారి చిదెల్ల కనకయ్య రూ.40 వేలను ముందుగా ఫోన్‌ పే ద్వారా కమరుద్దీన్‌కు చెల్లించినట్లు తేల్చారు. ఈమేరకు కమరుద్దీన్‌, చిదెల్ల కనకయ్యతో పాటు ఆటో యజమాని బతిని గోపీనాథ్‌, కనకయ్య వద్ద పనిచేసే దారా శ్రీనివాసరావును అరెస్ట్‌ చేయగా, షేక్‌ ఫిరోజుద్దీన్‌, జయరాజు, చంటి, బడినీడి బాలాంజనేయులు, చౌదరి, కోదాడకు చెందిన నరేష్‌, కల్లూరుకు చెందిన రెడ్డితో పాటు కోదాడకు చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నారని ఏసీపీ తెలిపారు. కాగా, గడిచిన రెండేళ్లలో రూ.9,30,100 చెల్లింపులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో కమరుద్దీన్‌ రూ.1.50 లక్షలు అర్జించగా, కోదాడకు చెందిన కనకయ్య పామాయిల్‌ విక్రయం ద్వారా సుమారు రూ.5.50 లక్షల లాభం పొందాడని గుర్తించారు. కాగా, పామాయిల్‌ ఫ్యాక్టరీ ఉద్యోగుల్లో ఎవరి పాత్ర అయినా ఉందా అనే అంశంతో పాటు అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం తదితర అంశాలపై విచారణ కొనసాగుతోందని ఏసీపీ రమణమూర్తి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement