అక్షరం నేర్పడం ఉపాధ్యాయుల విధి. ఆ అక్షరంతో జీవితాన్ని గెలిపించేలా తీర్చిదిద్దడం ఉత్తమ ఉపాధ్యాయుల లక్షణం. అమాయకత్వంతో బడిలోకి అడుగుపెట్టిన పిల్లలను సమాజం మెచ్చే పౌరులుగా, నలుగురికీ దారిచూపే విజేతలుగా తీర్చిదిద్దే అద్భుత శిల్పులు ఉపాధ్యాయులు. పాఠాలకే పరిమితం కాకుండా కష్టాల్లో ధైర్యం నూరిపోయడం, కలలకు రెక్కలు తొడిగి బతుకు బాటలో వెలుగుదివ్వెలుగా నిలిచే ప్రత్యక్ష దైవాలే గురువులు. నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలువురు విద్యార్థులను పలకరించగా.. వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన ఉపాధ్యాయుల ప్రత్యేకతలను వివరించారు.
● ఉపాధ్యాయులే సమాజ వెలుగుదివ్వెలు ● విద్యార్థుల భవితను తీర్చిదిద్దుతున్న టీచర్లకు వందనం
పదో తరగతిలో ఇంగ్లిష్ బోధించిన సరిత మేడమ్ నా జీవితంలో ప్రత్యేకం. పాఠాలు చెబుతూనే ఒత్తిడిని ఎదుర్కోవడం, బాధ్యతలు, భవిష్యత్ లక్ష్యాలు ఎంచుకోవడంపై అవగాహన కల్పించారు. ఎన్నో విలువైన విషయాలు నేర్పిన సరిత మేడమ్‌తో పాటు గురువులందరికీ కృతజ్ఞతలు.
– కోటపాటి అలేఖ్య,
ఇంటర్ మొదటి సంవత్సరం, ఖమ్మం
క్రమశిక్షణ, నమ్మకాన్ని అందించిన అమ్మానాన్న ఎం.శ్రీనివాసరావు(ఇంగ్లిష్ లెక్చరర్), ఎం.వరలక్ష్మి (సైన్స్ టీచర్) నా తొలిగురువులు. ఇబ్బంది పడినప్పుడల్లా వెన్నుతట్టి ధైర్యం చెప్పారు. నన్ను మంచి మనిషిగా, ఇంజినీర్‌గా తీర్చిదిద్దుతున్న గొప్ప గురువులు అమ్మానాన్నలే.
– ఎం.పూజిత చౌదరి,
ఇంజనీరింగ్ విద్యార్థిని
ఎనిమిదో తరగతిలో మంజులత మేడమ్ సైన్స్ బోధించేవారు. బయాలజీలోని క్లిష్టమైన విషయాలను సులభంగా అర్థమయ్యేలా చెప్పడం ఆమె ప్రత్యేకత. ఎన్ని సందేహాలు వచ్చినా ఓపికగా అర్థమయ్యే వరకు చెప్పేవారు. ఆమె సహనం, బోధనాశైలి నా ఉన్నతికి బాటలు వేశాయి.
– పి.అఖిల్‌చంద్ర, ఖమ్మం
మా బయాలజీ టీచర్ బట్టీ విధానంలో కాకుండా శ్రద్ధగా చదివేలా ప్రోత్సహించారు. ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఆలోచించి చదవడం నేర్చుకున్నాను. పాఠాలే కాక భవిష్యత్‌కు మార్గదర్శకంగా సూచనలు చేసేవారు. అందుకే ఇంటర్‌కు వచ్చినా ఆ టీచర్‌ను మరిచిపోలేను.
– నుజాహత్ ఆయేషా, ఇంటర్మీడియట్
నాకు ఇష్టమైన ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి మేడమ్. ఏన్కూరులో పదో తరగతి సమయాన తెలుగుబోధించిన ఆమె క్రమశిక్షణతో ఉండేవారు. పాఠాలే కాక కష్టాలను ఎదుర్కోవడం, జీవితంలో విజయానికి సూచనలు చేసేవారు. అందుకే మేడమ్‌ను మరిచిపోలేను.
– బి.ప్రసన్నకుమార్, డిగ్రీ తృతీయ
సంవత్సరం, ఖమ్మం
ఇంటర్‌లో ఫిజిక్స్ బోధించిన భవానీశంకర్ సార్ ఇష్టం. పాఠ్యాంశాలే కాక ప్రాక్టికల్స్ ప్రత్యేకంగా బోధించేవారు. అర్థమయ్యేలా సులువుగా బోధించడం, ఏ రోజుకారోజు సందేహాలు తీర్చడం సార్ ప్రత్యేకత. అందుకే సార్ నాకు ఎప్పటికీ రోల్ మోడల్. – జి.ప్రణీత్. సత్తుపల్లి
విద్యాబోధనతో పాటు మానసిక పరిణితి, శారీరక దారుఢ్యం, సమాజాన్ని చదవగలిగే ప్రజ్ఞను పిల్లలకు అందించే బాధ్యత కూడా ఉపాధ్యాయులపై ఉంటుంది. ఇందుకోసం ఉపాధ్యాయులు విద్యార్థి స్థాయికి వెళ్లి వారికి అర్థమయ్యే భాషలో, వీలైతే ప్రయోగాత్మక బోధన అవలంబిస్తే పిల్లలకు మేలు జరుగుతుంది. ఉపాధ్యాయులు పిల్లలందరికీ మంచి భవిష్యత్‌ను అందించడమే కాక తమ వైపు నుంచి భరోసా అందిస్తూ ధైర్యంగా ముందడుగువేసేలా మార్గనిర్ధేశం చేయాలి. విద్యార్థిలోని మంచి గుణాలను వెలికితీసి ఏ దారిలో వెళ్లాలనుకుంటున్నారో గుర్తించి తనదైన శైలిలో ప్రోత్సహించడంలో ప్రముఖ పాత్ర ఉపాధ్యాయులదే. అంతేకాక క్రమశిక్షణ, మంచి అలవాట్లు పెంపొందిస్తే విద్యార్థుల విజయానికి బాటలు పడతాయి.
– ఖమ్మం మయూరిసెంటర్ /
ఖమ్మం సహకారనగర్ / సత్తుపల్లి టౌన్
నేను ఆంగ్లంపై పట్టు సాధించడానికి రాజ్యలక్ష్మి టీచర్ కారణం. పదో తరగతిలోనే ఇంగ్లిషు రాయడం, అర్థం చేసుకునేలా బోధిస్తూ మమ్మల్ని ప్రోత్సహించారు. అందుకే రాజ్యలక్ష్మి మేడమ్‌తో పాటు ఇతర ఉపాధ్యాయులపై ఎన్నటికీ కృతజ్ఞతా భావంతో ఉంటా. – ఎం.అమృతలేఖ, సత్తుపల్లి
రమేష్ సార్ కేవలం పాఠ్యాంశాల బోధనకే కాక క్రమశిక్షణ కూడా నేర్పుతున్నారు. ప్రతీ పాఠశాల మాకు సులువుగా అర్థం అయ్యేలా బోధించడం సార్ ప్రత్యేకత. పరీక్షల్లో మంచి మార్కులు సాధించేలా ఇప్పటి నుంచే తీర్చిదిద్దుతున్నారు. – వేముల సాత్విక్, పెనుబల్లి
కేవలం పుస్తకాల్లోని పాఠాలే కాక జీవిత పాఠాలను కూడా ఉపాధ్యాయులు నేర్పిస్తున్నారు. అందరితో మాకు శ్రీను సార్ ఇష్టం. జీవశాస్త్రంలోని ప్రతీ పాఠం అర్థయ్యేలా బోధిస్తారు. క్రమశిక్షణ, జీవిత విలువలు కూడా రోజూ వివరిస్తుంటారు. – యశస్విని, పదో తరగతి, తల్లాడ
తెలుగు బోధించిన ప్రసాద్ సార్‌ను జీవితాంతం గుర్తుంచుకుంటా. ప్రతీరోజు పాఠాలే కాక సామాజిక పరిస్థితులు, సమాజంలో విద్యార్థినులు ఎలా ఉండాలో వివరించేవారు. జీవితంలో ఎదిగేలా తీర్చిదిద్దుతున్న సార్ నుంచి స్ఫూర్తి పొందా. – కె.దీక్షిత, సత్తుపల్లి


