● మంత్రుల మధ్య ఐక్యత లేదనేది ప్రచారమే.. ● కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్
ఖమ్మం మామిళ్లగూడెం: జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గాలు లేవని, భిన్నాభిప్రాయాలు ఉన్నా అంతా ఐక్యంగా పనిచేస్తున్నామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. జిల్లా, నగర నాయకత్వం సమన్వయంగా పనిచేస్తూ.. పాత, కొత్త అందరినీ కలుపుకుంటూ సమర్థులకు అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యాన ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ముగ్గురు మంత్రుల మధ్య ఐక్యత లేదనేది ప్రచారం మాత్రమేనని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ కార్యాలయానికి సైతం వస్తున్నారని తెలిపారు. మంత్రివర్గం నుంచి కొండా సురేఖ తొలగింపు బాధాకరమే అయినా తొలగింపునకు కారణమైన అంశాలపై అధినాయకత్వంతో ఏకీభవిస్తున్నానని చెప్పారు. సంక్షేమ పథకాల అమలుకు ఆర్థిక సమస్యలు ఉన్నా గత ప్రభుత్వ తప్పులను తమ ప్రభుత్వం సరిచేస్తోందని, 22ఏ జాబితాను వీలైనంత త్వరగా రైతాంగానికి నష్టం జరగని రీతిలో పరిష్కారం ఉంటుందని చెప్పారు. ఈ అంశంపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, బీఆర్‌ఎస్ నేతలుది రాద్ధాంతం మాత్రమేనని పేర్కొన్నారు. అలాగే, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా తమ ప్రభుత్వం నెరవేరుస్తోందని సత్యనారాయణ తెలిపారు. కాగా, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను మంత్రులు, ిపీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లి న్యాయమైన పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. ‘మీట్ ద ప్రెస్’కు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఏనుగు వెంకటేశ్వరరావు సమన్వయకర్తగా వ్యవహరించగా ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నామా పురుషోత్తం అధ్యక్షత వహించారు. ఇంకా రాష్ట్ర, జిల్లా నాయకులు మాటేటి వేణుగోపాల్, నర్వనేని వెంకట్రావు, కనకం సైదులు, వనం వెంకటేశ్వర్లు, చెరుకుపల్లి శ్రీనివాస్, మోహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


