రూ.50లక్షలతో కుల సంఘాలకు భవనాలు | - | Sakshi
Sakshi News home page

రూ.50లక్షలతో కుల సంఘాలకు భవనాలు

Sep 5 2026 12:08 AM | Updated on Sep 5 2026 12:08 AM

‘దాసరి’ని అభినందించిన

ఎమ్మెల్యే రాగమయి

సత్తుపల్లి: గ్రామాభివృద్ధి కోసం దాసరి మధుమోహన్‌రెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి దయానంద్‌ కొనియాడారు. సత్తుపల్లి మండలం గంగారంలో దాసరి మధుమోహన్‌రెడ్డి సొంత నిధులు రూ.50 లక్షలతో నిర్మించిన గౌడ, యాదవ కమ్యూనిటీ హాళ్లను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. గ్రామానికొకరు మధుమోహన్‌రెడ్డి వంటి దాతలుంటే గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతుందని తెలిపారు. గంగారం గ్రామంలో ఇప్పటికే రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు. అనంతరం దాసరి వెంకట్రారామిరెడ్డి(చిట్టినాయన), రాజకుమారి, మధుమోహన్‌రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ మట్టా దయానంద్‌, ఎండీఓ నాగేశ్వరరావు, సర్పంచ్‌ కాకర్ల రేవతి, కొలగట్ల చెన్నకేశవరావు, కావేటి అప్పారావు పాల్గొన్నారు.

నారాయణపురంలో

స్థలవివాదం

తల్లాడ: తల్లాడ గ్రామపంచాయతీ పరిధి నారాయణపురంలో స్థల వివాదం శుక్రవారం ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. నారాయణపురంలోని పాత చర్చికి చెందిన స్థలాన్ని చర్చి ఫాదర్లు గ్రామానికి చెందిన రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, వేమిరెడ్డి నరసింహారెడ్డి తదితరులకు గతేడాది విక్రయించగా ఫెన్సింగ్‌ వేశారు. అయితే, కొందరు ఆ స్థలాన్ని తాము దానంగా ఇచ్చినందున అమ్మకానికి వీల్లేదని కోర్టును ఆశ్రయించారు. ఈక్రమాన ఫెన్సింగ్‌ను చర్చి ఫాదర్లు, మరికొందరు తొలగిస్తుండగా కొనుగోలు చేసిన వారి అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎస్‌ఐ ఎన్‌.వెంకటకృష్ణ చేరుకొని వ్యవహారం కోర్టులో ఉన్నందున ఎవరూ స్థలంలోకి వెళ్లొద్దని చెప్పి పంపించేయడంతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగింది.

ద్విచక్ర వాహనం

అదుపు తప్పి ఉద్యోగి మృతి

సత్తుపల్లిటౌన్‌: స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో తీవ్రంగా గాయపడిన నీటిపారుదల శాఖ ఉద్యోగి మృతి చెందాడు. కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన పుప్పాల వేణుకుమార్‌(33) సత్తుపల్లి నీటిపారుదల శాఖ కార్యాలయంలో రికార్డ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన గురువారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా సింగరేణి క్వార్టర్స్‌ మార్గంలో స్పీడ్‌ బ్రేకర్ల వద్ద వాహనం అదుపు తప్పి కింద పడింది. ఘటనలో తీవ్రగాయాలైన వేణుకుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య నాగమణి, కుమార్తె నవదీక్షిత ఉండగా, పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement