నో చెబుతారు... ప్రశ్నిస్తారు ! | - | Sakshi
Sakshi News home page

నో చెబుతారు... ప్రశ్నిస్తారు !

Sep 5 2026 12:08 AM | Updated on Sep 5 2026 12:08 AM

ప్రభుత్వం కంటే ముందు... మౌనం వద్దు తమాషా చేస్తే ఊరుకోం.. పరీక్షా సమయంలో..

సలహాల పెట్టె

సమస్యలకు పరిష్కారాలు చూపుతున్న ‘ఫ్రెండ్లీ టీచర్‌’ విధానం

సమస్యలతో సర్దుకుపోయే

బాధ లేకుండా కౌన్సెలింగ్‌

2024–25 విద్యా సంవత్సరంలో గర్ల్‌ చైల్డ్‌, అడాలసెంట్‌ సేఫ్టీ క్లబ్‌ పేరుతో రాష్ట్రప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే, భద్రాచలం బాలికోన్నత పాఠశాలలో 2018 నాటికే సేఫ్టీ క్లబ్‌ ఏర్పాటైంది. ప్రైవేట్‌ పాఠశాలల నుంచి విపరీతమైన పోటీ ఉన్నప్పుడు సైతం ఇక్కడ 500తగ్గకుండా బాలికలు చదువుకునేవారు. ఈక్రమాన పోకిరీల బారి నుంచి బాలికలు రక్షించుకునేలా అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ సహకారంతో ఇక్కడ సేఫ్టీ క్లబ్‌ ఏర్పాటు చేశారు. క్లబ్‌కు ప్రిన్సిపాల్‌ కన్వీనర్‌గా, ఒకరు లేదా అంతకు మించి ఉపాధ్యాయులు ఫ్రెండ్లీ టీచర్లుగా వ్యవహరిస్తారు. ప్రతీ తరగతి నుంచి ఇద్దరు విద్యార్థినులు సభ్యులుగా ఉంటారు. ప్రతీనెల సభ్యులు సమావేశమై బాలికలు ఎదుర్కొనే సమస్యలు – పరిష్కార మార్గాలు – ఆచరణపై చర్చిస్తారు. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న ఈ క్లబ్‌ ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం పరిసర ప్రాంత బాలికలకు ఎంతో భరోసా కల్పించడమే కాక పంటి బిగువున భరిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపింది. ఇబ్బందికర పరిస్థితుల్లో సర్దుకుపోయేందుకు బదులు సమస్యను ఎదిరించే తెగువను నేర్పిస్తోంది.

ఎప్పుడు హుషారుగా ఉండే ఓ విద్యార్థిని తీరు అకస్మాత్తుగా మారడమే చదువులోనూ వెనుకబడింది. ఆ బాలిక ఇంట్లో తాత వయస్సు ఉన్న వ్యక్తి ప్రవర్తిస్తున్న తీరు అందుకు కారణమని తెలిసింది. ఇంట్లో అమ్మకు సైతం చెప్పుకోలేక, వృద్ధుడిని ఎదురించలేక నరకం చూసింది. చివరకు ఈ విషయం సేఫ్టీ క్లబ్‌ ద్వారా ఫ్రెండ్లీ టీచర్‌ దృష్టికి వెళ్లింది. దీంతో నెల పాటు విద్యార్థినికి దగ్గరైన ఉపాధ్యాయురాలు... విషయం బయటకు చెప్పించి ‘వద్దు.. నో’ అని చెప్పడంపై అవగాహన కల్పించారు. మూడు నెలల తర్వాత కౌన్సెలింగ్‌ ఫలించడంతో తప్పుడు పనులు చేసేందుకు ముందుకొచ్చిన ‘పెద్ద’ వ్యక్తి చేతులు వెనక్కి వెళ్లాయి. మళ్లీ మునుపటి చిరునవ్వు ఆ బాలిక మోముపై రావడంతో పదో తరగతి పూర్తి చేసి పైచదువుల్లో రాణిస్తోంది.

బాలికలు పాఠశాలకు వెళ్లివచ్చే దారుల్లో పోకిరీలు తిష్ట వేస్తుంటారు. అసభ్యకరమైన కామెంట్లు చేయడం, మౌనంగా భరించడాన్ని ఆమోదంగా భావించి మరింత చొరవ చూపడం సాధారణమైపోయింది. ఇవన్నీ ఇంట్లో చెబితే బడి మాన్పిస్తారనే భయం, వెళ్లాలంటే పోకిరీల బెడద తట్టుకోవడం ఎలాగో తెలియక ఇబ్బంది పడ్డారు. ఈక్రమాన సేఫ్టీ క్లబ్‌ సభ్యులు, ఫ్రెండ్లీ టీచర్ల చొరవతో ఈవ్‌టీజింగ్‌ ఎదురైతే డయల్‌ 112, షీ టీమ్స్‌కు ఫోన్‌ చేసి చెప్పే ధైర్యం పెంచుకున్నారు.

విద్యార్థులు ఏటా వార్షిక పరీక్షలు రాయడానికి ముందు జనవరి, ఫిబ్రవరిలో ఫ్రెండ్లీ టీచర్లకు పరీక్ష ఎదురవుతోంది. ప్రేమ పేరుతో వెంటపడే అబ్బాయిలు ఈ సమయాన బాలికలపై విపరీతమైన ఒత్తిడి తీసుకురావడమే ఇందుకు కారణం. విద్యార్థినుల దృష్టి మరల్చేందుకు పన్నాగాలు వేస్తుంటారు. ఈ సమయాన ఉపాధ్యాయినులు ప్రత్యేకంగా విద్యార్థినులను గమనిస్తూ ప్రలోభాల బారిన పడకుండా కాపాడడం మొదలుపెట్టారు.

నిత్య జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను బయటకు చెప్పుకోలేక కొందరు విద్యార్థినులు సతమతం అవుతుంటారు. ఇలాంటి వారి కోసం పాఠశాలలో ‘సలహాల పెట్టె’ ఏర్పాటుచేశారు. విద్యార్థినులు తమ పేరు రాయకుండా సమస్య రాసి అందులో వేస్తే సరిపోతుంది. సేఫ్టీ క్లబ్‌ సభ్యులు ఈ పెట్టెలో వచ్చ లేఖలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి పాటుపడుతుండడం మెరుగైన ఫలితాలు వస్తున్నాయి.

భద్రాచలం బాలికోన్నత పాఠశాలలో ‘సేఫ్టీ క్లబ్‌’

ఏ పరీక్షలో మార్కులు ఎక్కువ వస్తే ఆ సబ్జెక్టు బోధించే గురువులకే గుర్తింపు ఎక్కువగా దక్కుతోంది. అయితే, పాఠ్యాంశాలే కాక నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునే తీరు నేర్పించే గురువులు కొందరే ఉంటారు. అడుగడుగునా సవాళ్లతో కూడిన జీవితం ఎదుర్కొనే బాలికలకు ఇది ప్రధాన అవసరం. అందుకే విద్యార్థి దశ నుంచే పాఠాలతో పాటు సమస్యలు పరిష్కరించుకునే నైపుణ్యాలు నేర్పేలా భద్రాచలం బాలికోన్నత పాఠశాలలో అమలుచేస్తున్న సేఫ్టీ క్లబ్‌ విధానం సత్ఫలితాలను ఇస్తోంది.

– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement