రఘునాథపాలెం సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

రఘునాథపాలెం సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక

Sep 5 2026 12:08 AM | Updated on Sep 5 2026 12:08 AM

● ఎల్‌నినో దృష్ట్యా పంటల సాగులో జాగ్రత్త ● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

● ఎల్‌నినో దృష్ట్యా పంటల సాగులో జాగ్రత్త ● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

రఘునాథపాలెం: ఖమ్మం నియోజకవర్గంతో పాటే రఘునాథపాలెం మండల సమగ్ర అభివృద్ధి, వసతుల కల్పన, రైతు సంక్షేమానికి ప్రణాళికలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపా రు. రఘునాథపాలెం మండలం పుఠానితండాలో జెడ్పీ రోడ్డు నుంచి రేపల్లెవాడ తండా వరకు రూ.330.92 లక్షలతో నిర్మించే బీటీ రోడ్డుకు కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.తో కలిసి మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తుమ్మల నిరుపేదలు, గుడిసెల్లో నివసిస్తున్న వారికి ప్రాధాన్యతా క్రమంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పొలాల దారులు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.100 కోట్లతో ప్రతిపాదించగా ఇప్పటికే రూ.75 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. గిరిజన విద్యార్థుల కోసం ఐటీడీఏ ఆధ్వర్యాన స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పాఠశాలను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. కాగా, వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన రైతులు తక్కువ కాలపరిమితి కలిగిన పంటలు సాగు చేయాలని సూచించారు. పామాయిల్‌, మిర్చి, కూరగాయల సాగుతో మంచి లాభాలు పొందొచ్చన్నారు. మంచుకొండ ద్వారా నీటి విడుదలకు చర్యలు చేపట్టగా, బుగ్గువాగు ప్రాజెక్టు ద్వారా దాదాపు రూ.100 కోట్లతో పైప్‌లైన్ల ద్వారా చెరువులను నింపుతామని తెలిపారు. కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టా భూముల యజమానులకు బోర్లు తవ్వుకునేందుకు దరఖాస్తు చేసుకున్న రోజే పరిశీలించి అనుమతులు ఇస్తామని చెప్పారు. ఇందుకోసం 10వ తేదీన మండల కార్యాలయంలో ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌, జిల్లా అటవీ అధికారి అనూప్‌ అగర్వాల్‌, సుడా, గ్రంథాలయ సంస్థ, మార్కెట్‌, ఆత్మ కమిటీల చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మహ్మద్‌ ఖాదర్‌బాబా, యరగర్ల హన్మంతరావు, చిన్న వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ మూడు చిన్నా, జలవనరుల శాఖ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, పీఆర్‌ ఈఈ మహేష్‌, ఏఈ చిరంజీవి, ఎంపీడీఓ అశోక్‌, తహసీల్దార్‌ శ్వేత, కాంగ్రెస్‌ జిల్లా, నగర, మండల అధ్యక్షులు నూతి సత్యనారాయణ, నాగండ్ల దీపక్‌చౌదరి, దేవ్‌సింగ్‌, నాయకులు గుత్తా వెంకటేశ్వర్లు, తాతా రఘురాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement