కాలక్షేపమా.. నిర్లక్ష్యమా?! | - | Sakshi
Sakshi News home page

కాలక్షేపమా.. నిర్లక్ష్యమా?!

Jul 29 2026 12:58 AM | Updated on Jul 29 2026 12:58 AM

పెండింగ్‌ పనుల్లో కొన్ని

నిధులు మంజూరై ఏళ్లు గడిచినా

మొదలుకాని పనులు

కొన్ని టెండర్ల దశలో..

ఇంకొన్ని ప్రతిపాదనలకే పరిమితం

మధిర: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నా కొన్ని పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. నియోజకవర్గంలోని మధిర, ఎర్రుపాలెం, బోనకల్‌, చింతకాని, ముదిగొండ మండలాలు భౌగోళికంగా చిన్నాభిన్నంగా ఉంటాయి. ఎర్రుపాలెం నుంచి ఖమ్మం వరకు రైల్వేలైన్‌ ఉన్నా ఎర్రుపాలెం నుంచి నియోజకవర్గంలోని చివర మండలమైన ముదిగొండ వరకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఎర్రుపాలెం నుంచి మధిర, బోనకల్‌, చింతకాని, ముదిగొండ మండలాలను కలుపుతూ నాలుగు లైన్ల రహదారి నిర్మించాలని ఏళ్లుగా ప్రజలు కోరుతున్నారు. ఇవికాక మరికొన్ని రహదారుల పనుల టెండర్లకు మోక్షం లభించకపోగా.. ఇంకొన్ని ప్రతిపాదనల దశ దాటడం లేదు.

గతంలో పోలిస్తే మెరుగే...

మధిర నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాలకు గతంలో లింకు రోడ్ల సౌకర్యం లేదు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కృషితో పలు మార్గాల్లో రహదారి సౌకర్యం ఏర్పడింది. నారాయణపురం, తూటికుంట్ల తదితర గ్రామాలకు వెళ్లేందుకు చుట్టూ ఆరు వైపుల నుంచి బీటీ రోడ్లు నిర్మించడం విశేషం. గతంలో భట్టి డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసినప్పుడు రూ. 2వేల కోట్ల నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా ఉండడంతో నిధులు మంజూరు చేయిస్తున్నారు.

ప్రత్యేక డివిజన్‌ ఏర్పాటైతేనే..

ఆర్‌అండ్‌ బీ సత్తుపల్లి డివిజన్‌ పరిధిలో మధిర సబ్‌ డివిజన్‌గా ఉంది. ఇందులో మధిర, ఎర్రుపాలెం, బోనకల్‌ మండలాలు ఉన్నాయి. ఇక చింతకాని మండలం ఖమ్మం సబ్‌ డివిజన్‌లో, ముదిగొండ మండలం పాలేరు సబ్‌ డివిజన్‌లో ఉంది. అలాకాకుండా మధిర నియోజకవర్గంలోని అన్ని మండలాలను కలిపి డివిజన్‌గా ఏర్పాటుచేస్తే పరిపాలనాపరంగా సౌకర్యంతో పాటు పనుల్లో వేగం పుంజుకుంటుందనే భావన వ్యక్తమవుతోంది. కాగా, కొన్ని పనులు ప్రతిపాదనలకే పరిమితం కాగా, ఇంకొన్ని టెండర్లు దశ దాటడం లేదు. మరికొన్ని రోడ్లకు నాలుగైదు సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంకొన్ని రహదారుల టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టడం లేదు.

మధిరలోని ఆర్‌వీ కాంప్లెక్స్‌ నుంచి ఆత్కూరు క్రాస్‌ వరకు రూ.19 కోట్ల నిధులతో ఆరు లైన్లుగా రహదారి విస్తరణ పనులకు గత ఏడాది డిసెంబర్‌ 15న శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటికి ఎనిమిది సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు.

మధిర ట్యాంక్‌ బండ్‌ మార్గంలో నాలుగు లేన్లుగా రోడ్డు విస్తరణకు రూ.10 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు.

ఎర్రుపాలెం రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నుంచి ఏపీ సరిహద్దు వరకు 2.9 కి.మీ. మేర నాలుగు లైన్ల రహదారి విస్తరణకు రూ.18 కోట్లు నిధులు మంజూరైనా పనులు చేపట్టడం లేదు.

ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సంబంధించి 296 ఎకరాల భూసేకరణ కోసం రూ.50 కోట్లు నిధులు సిద్ధంగా ఉన్నాయి. ఒకటో ప్యాకేజీ కింద కృష్ణాపురం నుంచి దెందుకూరు వరకు 13 కి.మీ. మేర రూ 193.52 కోట్ల హ్యామ్‌ పథకం కింద నిధులు కేటాయించి టెండర్‌ పూర్తిచేసినా పనుల్లో పురోగతి లేదు.

వైరా నుంచి బోనకల్‌ వరకు 25.2 కి.మీ. మేర నాలుగు లైన్ల రహదారి విస్తరణకు రూ.149.20కోట్లు, ఖమ్మం నుంచి బోనకల్‌ వరకు 28.3 కి.మీ. మేర నాలుగు లైన్లుగా విస్తరణకు రూ 148.62 కోట్లు, బోనకల్‌ క్రాస్‌ నుంచి ఎర్రుపాలెం వరకు 35.5 కి.మీ. రహదారిని నాలుగు లైన్లుగా విస్తరణకు రూ.198.56 కోట్లు, బోనకల్‌ నుంచి ఆళ్లపాడు, రాయన్నపేట, వంగవీడు మీదుగా మధిర వరకు 15.72 కి.మీ. మేర నాలుగు లైన్ల రహదారి విస్తరణకు రూ.94.32 కోట్లు నిధులు మంజూరయ్యాయి. అలాగే, మధిరలో రైల్వే అండర్‌ పాస్‌ నిర్మాణానికి రూ.38.10కోట్లు మంజూరు కాగా టెండర్‌ దశలో ఉంది. ఇక మధిర, ఎర్రుపాలెం, బోనకల్‌ మండలాల పరిధిలో లోలెవల్‌ కాజ్‌వేలు, చప్టాల వద్ద 26 బ్రిడ్జిల నిర్మాణానికి రూ.82.50 కోట్లు మంజూరవడంతో టెండర్లు ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు.

రహదారుల విస్తరణకు

లభించని మోక్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement